ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం అమ్మేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు చాలాచోట్ల ధాన్యం బస్తాలు తడిసి నష్టపోతున్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలంలో బుధవారం కురిసిన వర్షానికి ధాన్యపు బస్తాలు తడిచిపోయి అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. వనపర్తి జిల్లా మదనాపురంలో కోతలు పూర్తై అమ్మకానికి ధాన్యం సిద్ధంగా ఉన్నా.. గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడెక్కారు. ఇలా ఉమ్మడి జిల్లాలో గన్నీబ్యాగులు, లారీల కొరత, మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవడం లేదని, తరుగుపేరుతో కోతలు వేస్తున్నారని ఏదో ఓ చోట ఆందోళన బాట పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మాత్రం వేగం పుంజుకోవడం లేదు. మిల్లర్లు తక్కువ ధరలకు సొంతంగా కొనుగోళ్లు చేస్తూ కావాలనే ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.
కొనుగోలు చేసి వారం గడిచినా..
మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం బండర్‌పల్లిలో 2,100 ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించకుండా ఉండిపోయాయి. కొనుగోలు చేసి వారం గడిచినా లారీలు రాక ధాన్యాన్ని మిల్లులకు తరలించలేదు. టార్పాలిన్లు అద్దెకు తీసుకువచ్చి బస్తాలు తడవకుండా కప్పుతున్నారు. రోజువారీ ఖర్చులు పెరగిపోతుండగా.. వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితులు చూసి మిగతా రైతులు అమ్మేందుకు ధాన్యం తీసుకురావాలంటనే ఆందోళన చెందుతున్నారు. ఇంతకంటే ప్రైవేటులో అమ్ముకోవడం మేలని.. బండర్‌పల్లిలో కొంతమంది రైతులు క్వింటాకు 15 వందలకే విక్రియించేశారు. ప్రభుత్వ మద్దతు ధర 18వందల88 రూపాయలుండగా.. బయట అమ్ముకుని నష్టపోతున్నారు.