ఏపీలో మిగిలిపోయిన మున్సిపల్, నగర పంచాయతీ స్థానాలకు (Andhra pradesh municipal election results news) జరిగిన ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైకాపా.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కీలకమైన కుప్పం మున్సిపాలిటిలో ఫ్యాన్ పార్టీ పాగా వేసింది. రాజంపేట, గురజాల, దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్లలో వైకాపా విజయ దుందుభి మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలోనే తెదేపా గెలుపొందింది.
కుప్పంలో వైకాపా పాగా..
తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని.. వైకాపా కైవసం చేసుకుంది (YSRCP wins in Kuppam news). కుప్పం పురపాలికలోని 25 వార్డులకుగాను.. 24 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 18 స్థానాల్లో ఫ్యాన్ పార్టీ విజయం సాధించింది. ఆరు వార్డుల్లో తెదేపా గెలిచింది. ఒక స్థానం గతంలోనే ఏకగ్రీవమైంది.
ఫ్యాన్ పార్టీ జోరు..
నెల్లూరు నగర పాలక సంస్థలో వైకాపా సత్తా చాటింది. 54 డివిజన్లకు గానూ.. 42 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 4 డివిజనల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ గతంలోనే 8 డివిజన్లు వైకాపాకు ఏకగ్రీమయ్యాయి.
హోరాహోరీ..
కృష్ణా జిల్లాలోని కొండపల్లి పురపాలిక ఎన్నిక హోరాహోరీగా సాగింది. మొత్తం 29 వార్డుల్లో వైకాపా 14, తెదేపా 14 వార్డుల్లో విజయం సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి (తెదేపా రెబల్) గెలుపొందారు.
గురజాలలో.. దాచేపల్లిలో ఇలా...
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 20 స్థానాలకు గానూ వైకాపా - 18, తెదేపా 2 వార్డుల్లో విజయం సాధించింది. ఇక గుంటూరు జిల్లాలోని గురజాల నగర పంచాయతీలో వైకాపా గెలిచింది. 20 వార్డులకు గానూ.. 16 వైకాపా, 3 తెదేపా గెలవగా.. ఒక్క స్థానంలో జనసేన పాగా వేసింది. దాచేపల్లి నగర పంచాయతీని కూడా వైకాపా గెలుచుకుంది. 20 వార్డులకు ఎన్నికలు జరగగా.. 11 స్థానాల్లో వైకాపా, 7 వార్డుల్లో తెదేపా విజయం సాధించాయి. జనసేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలిచారు.
ఆకివీడిలో వైకాపా
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీని వైకాపా గెలుచుకుంది. 20 వార్డులకుగానూ వైకాపా 12, తెదేపా 4 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన 3 స్థానాల్లో గెలవగా.. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
దర్శిలో తెదేపా...
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 20 వార్డుల్లో 13 స్థానాల్లో సైకిల్ పార్టీ పాగా వేసింది. అధికార వైకాపా.. కేవలం 7 స్థానాల్లో గెలిచింది.
కడప జిల్లాలోని రాజంపేట పురపాలికను వైకాపా కైవసం చేసుకుంది. 29 వార్డుల్లో 24 వైకాపా, 4 తెదేపా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక కమలాపురం నగర పంచాయతీలోనూ ఫ్యాన్ గాలి వీచింది. 20 వార్డుల్లో 15 స్థానాలను వైకాపా.. 5 స్థానాల్లో తెదేపా గెలుచుకున్నాయి. కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీని వైకాపా గెలుచుకుంది. ఇక్కడ ఉన్న 20 వార్డుల్లో వైకాపా 14, తెదేపా 6 వార్డుల్లో గెలిచాయి. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీని అధికార వైకాపా కైవసం చేసుకుంది. 18 వార్డుల్లో వైకాపా, 2 వార్డుల్లో తెదేపా విజయం సాధించాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పురపాలిక 23వ వార్డులో తెదేపా అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. ఇక కాకినాడ నగర పాలక సంస్థలో ఎన్నికలు జరిగిన 4 డివిజన్లూ వైకాపా కైవసం చేసుకుంది. విశాఖ జీవీఎంసీ పరిధిలోని 31, 61 డివిజన్లలో ఫ్యాన్ పార్టీ పాగా వేసింది. విజయనగరం కార్పొరేషన్ ఒకటో డివిజన్‌లో కూడా అధికార పార్టీ గెలిచింది.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీచేస్తారని అనుకోవట్లేదు: మంత్రి పెద్దిరెడ్డి
ఫలితాలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందన్నారు. దాని ఫలితంగానే కుప్పం మున్సిపాలిటీలో వైకాపాకు ఘన విజయం దక్కిందని వ్యాఖ్యానించారు.అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా జగన్ పాలన ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెదేపా దౌర్జన్యకాండను అడ్డుకునేందుకే కుప్పం ప్రజలు వైకాపాను గెలిపించారన్నారు. కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాను ప్రజలు తిరస్కరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారని తాము అనుకోవట్లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాక ఓట్ల కోసం డబ్బులు పంచాల్సిన అవసరం తమకు లేదన్నారు. దొంగ ఓట్లు వేశారంటున్న తెదేపా ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఏ పోలింగ్ బూత్‌లో అయినా దొంగ ఓట్లు వేశారంటూ తెదేపా ఏజెంట్లు అడ్డుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో తనపై చంద్రబాబు పోటీ చేస్తే ఆహ్వానిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు.
ఇవీచూడండి:mlc nominations: ఆరుగురు తెరాస అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే..