తెలంగాణ

telangana

ETV Bharat / city

Baby Photography: వెల కట్టలేని బాల్యం.. ఆమె కెమెరాతో మరింత మధురం

అప్పటివరకూ ఆమె ఓ సాధారణ ఉద్యోగి. సాఫ్ట్‌వేర్ కొలువుతో అందరిలాగే కుటుంబానికి ఆసరాగా నిలిచేది. తనకో బాబు పుట్టడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ముద్దుల కుమారుడి బోసినవ్వులు బంధించేందుకు స్వయంగా కెమెరా అందుకుంది. ఏడున్నరేళ్లలో ఉద్యోగం ఇవ్వని సంతృప్తి.. కెమెరా ద్వారా దొరకడంతో దాన్నే.. ఉపాధిగా మార్చుకుంది. మూడేళ్లలోనే 3 వేల మందికి పైగా చిన్నారుల ఫొటోలు తీసి ఎందరో తల్లులకు మరిచిపోలేని జ్ఞాపకాలు అందించింది. ఫొటోగ్రఫి రంగంలో మహిళలు సైతం రాణించగలరని.. తనదైన ప్రత్యేకత చూపుతూ ఆదర్శంగా నిలుస్తోంది.. మానస అల్లాడి.

women photographer manasa creating craziness in baby photography
women photographer manasa creating craziness in baby photography

By

Published : Aug 10, 2021, 7:10 PM IST

వెల కట్టలేని బాల్యం.. ఆమె కెమెరాతో మరింత మధురం

ఓ గదిలో బీచ్... ఇసుకలో ఆడుకుంటున్నాడు ఓ బుజ్జిబాబు.. కెమెరా పట్టుకొని అక్కడికి వచ్చారు మానస. బాబు దృష్టి తనవైపు మళ్లించేందుకు రైమ్స్ పాడారు. అవి వింటుండగానే.. క్లిక్ క్లిక్ మంటూ క్షణాల్లో ఆ పసివాడి బోసినవ్వులను కెమెరాలో బంధించారు. మరో గదికి వెళ్లారు.. అక్కడ అద్దం ముందు ముద్దు ముద్దుగా యువరాణిలా తయారవుతోంది మరో చిన్నారి. నవ్విస్తూ.. లెన్స్ సెట్ చేసి ఆ బజ్జాయినీ కెమెరాలో బంధించారు. తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వులు పూసేలా చేశారు. ఇదీ.. సికింద్రాబాద్ బోయినిపల్లిలోని 'గిగిల్స్' ఫొటోగ్రఫి వ్యవస్థాపకురాలు మానస అల్లాడి ప్రత్యేకత. బేబీ ఫొటోగ్రఫిలో మూడేళ్లుగా రాణిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఇప్పటికే వేలాది చిన్నారుల నవ్వులను ఫొటోల రూపంలోకి మార్చి.. ఫొటోగ్రాఫర్ అనే మాటకు కొత్త అర్థం చెప్పారు.

తన పిల్లలకు సాధ్యం కాలేదని..

మానస స్వస్థలం కరీంనగర్. బీటెక్ పట్టాతో హైదరాబాద్​కు వచ్చి ఇన్ఫోసిస్​లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్​గా చేరారు. 2013లో బోయిన్​పల్లికి చెందిన నిషాంత్​తో వివాహం జరిగింది. కుటుంబం, ఉద్యోగంతోనే ఏడేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో మానసకు పాప పుట్టినప్పుడు మంచి ఫొటోలు తీసుకోవాలని అనుకున్నారు. కుదరలేదు. తర్వాత బాబు. అప్పుడూ సాధ్యపడలేదు. ఇక ఇష్టమైన దానికోసం తానే కెమెరా అందుకున్నారు. నచ్చినట్లు ఫోటోలు తీసుకున్నారు. వాటిని చూసి ఇరుగుపొరుగు వారు మెచ్చుకోవడంతో.. ఫొటోగ్రఫినే వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో డిప్లొమా చేశారు. అనంతరం బేబీ ఫొటోగ్రఫిని ఉపాధిగా మార్చుకున్నారు. ఉద్యోగంలో దొరకని సంతృప్తిని కుటుంబసభ్యుల సహకారం బోయినపల్లిలో 'గిగిల్స్' ఫొటోగ్రఫి పేరుతో స్టూడియో పెట్టి సొంతం చేసుకున్నారు.

25 థీమ్​ స్టూడియోలతో...

బేబీ ఫొటోగ్రఫిలో రాణించాలనుకొని సవాలుగా తీసుకున్న మానస.. పొదుపు చేసుకున్న డబ్బులతో 25 థీమ్ స్టూడియోలను ఏర్పాటు చేశారు. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్ లతో దేశంలోనే అతిపెద్ద బేబీ ఫొటో స్టూడియోగా తీర్చిదిద్దారు. బీచ్, గ్యారేజ్, కోర్టు హాల్, హాస్పిటల్, జంగిల్ ఇలా.. ప్రత్యేక థీమ్ లతో పిల్లలకు ప్రత్యక్ష అనుభూతి కలిగించేలా డిజైన్ చేశారు. 5 రోజుల పసివాళ్ల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలను తల్లిదండ్రులు కోరిన విధంగా క్షణాల్లో ఫొటోలు తీసి ఇస్తుంది గిగిల్స్‌ స్టూడియో. ఫొటోలకు కావల్సిన సామగ్రి, దస్తులనీ వారే సమకూరుస్తారు. అప్పుడే పుట్టిన పిల్లల ఫొటోగ్రఫిలో మహిళలకు మంచి అవకాశం ఉందంటున్న మానస.. ఫొటోగ్రఫి అభిరుచిగా కాకుండా వృత్తిగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.

20 మందికి ఉపాది...

సాప్ట్ వేర్ కొలువు నుంచి నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని రాణిస్తున్న మానస... గిగిల్స్​లో 20 మంది యువతకు ఉపాధి సైతం కల్పించారు. హైదరాబాద్​లో వస్తున్న ఆదరణతో కరీంనగర్ లోనూ మరో స్టూడియో ప్రారంభించారు. మానస ఇష్టంగా క్లిక్ చేసుకున్న ఈ జీవిత చిత్రం.. మహిళలు, యువతకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అనతికాలంలోనే ఎంతో ఆదరణ చూరగొన్న మానస... రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఐజీఏ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details