తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

ఏపీ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమని వెల్లడించింది. ఈ అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని పేర్కొంది.

ramesh kumar
ramesh kumar

By

Published : Nov 17, 2020, 4:23 PM IST

కొవిడ్‌ కారణంగా ఏపీలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని.. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలైందని ఈ సందర్భంగా ఎస్‌ఈసీ ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఈ ఎన్నికలు.. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ దోహదపడతాయని చెప్పారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details