లష్కర్ బోనాలు.. పోటెత్తిన భక్తులు.. ప్రముఖుల సందర్శనలు లష్కర్ బోనాల(Lashkar Bonalu)తో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మక వాతావరణం వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామునే రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. మధ్యాహ్నం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మహంకాళి అమ్మకు తలసాని పట్టువస్త్రాలు సమర్పించారు.
రెట్టింపు ఉత్సాహంతో..
"మహంకాళి అమ్మవారు రాష్ట్ర ప్రజలను సల్లంగా చూడాలి. ప్రజలందరికి బోనాల శుభాకాంక్షలు. బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది కరోనాతో బోనాలు జరుపుకోలేకపోయాం. కానీ.. ఈయేడు రెట్టింపు ఉత్సాహంతో.. జాగ్రత్తలు పాటిస్తూ బోనాల పండుగ చేసుకుంటున్నాం."
- ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
ప్రముఖుల సందర్శన..
చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి(Lashkar Bonalu) అమ్మను దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డిలు అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన దత్తాత్రేయ.. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడమని వేడుకున్నారు.
రేవంత్ రెడ్డికి అమ్మ ఆశీర్వాదం..
మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహంకాళి(Lashkar Bonalu) అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు లష్కర్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు దంపతులు లష్కర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు.
వరదను అడ్డుకో తల్లీ..
"తెలంగాణ ప్రజలకు మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం ఉంది. ఇక ముందు కూడా అమ్మ మన రాష్ట్రాన్ని సల్లంగా చూడాలి. హైదరాబాద్లో వరదలను అడ్డుకోవాలని.. ప్రజల ప్రాణాలను కాపాడాలని అమ్మను వేడుకున్నా. ఈ అతివృష్టి నుంచి రక్షణ కల్పించాలని మొక్కుకున్నాను. రాష్ట్ర ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు."
- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
అద్భుతమైన అలంకరణ
బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయ ఆలంకరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధాన ముఖ ద్వారం నుంచి ఆలయం వరకు అరటి ఆకులు, కొబ్బరిమట్టలు, పూల తోరణాలు ఏర్పాటు చేశారు. మూడుటన్నుల పూలు 70మందికి పైగా కార్మికులతో అలంకరణ చేశారు.
బోనాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 2వేల మంది పోలీసులను మోహరించారు. 400సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో వాహనాలు ఆపకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.