అధిక ఛార్జీలకు చెక్... నేటి నుంచి అద్దె బస్సులోనూ టికెట్లు! కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు కొనసాగుతోంది. అద్దె బస్సులతో పాటు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లు కండక్టర్లను నియమించి బస్సులు నడుపుతున్నారు. తాత్కాలిక కండక్టర్లు టికెట్లు ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎక్కువగా వసూలూ చేసిన ఆదాయాన్ని పూర్తిగా డిపోకు ఇస్తున్న పరిస్థితి లేదు. ఇందుకు టికెట్లు ఇవ్వక పోవడమే కారణంగా అధికారులు గుర్తించారు. ఇవాళ్టి నుంచి తాత్కాలిక కండక్టర్లు కూడా విధిగా టికెట్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
నేటి నుంచి పాత టికెట్లు
ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో టిమ్స్ యంత్రాలనే వాడుతున్నారు. తాత్కాలిక కండక్టర్లకు ఈ యంత్రాలను ఇంకా ఇవ్వలేదు. గతంలో ఆర్టీసీ పాత విధానంలోనే ముద్రించిన కొన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్నాళ్లపాటు ఆ టికెట్లను తాత్కాలిక కండక్టర్లు ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి దాదాపుగా అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు ఆ టికెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
టిమ్స్ యంత్రాలపై శిక్షణ
టిమ్స్ యంత్రాల ద్వారా కూడా తాత్కాలిక కండక్టర్లు టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు టిమ్స్ యంత్రాల బాధ్యతలు చూస్తున్న సూపర్‌వైజర్లు కూడా సమ్మెలో ఉన్నారు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు వీలుగా ఆర్టీసీకి టిమ్స్ యంత్రాలను సరఫరా చేసిన కంపెనీ సేవలను వినియోగించుకోనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా ఆర్టీసీ వినియోగించుకుంటోంది. బస్సుల రాకపోకలు, ఇతర సమాచారాన్ని పొందు పరిచేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఇతర శాఖల నుంచి ఆయా డిపోలకు కేటాయిస్తున్నారు. బస్సుల నిర్వహణ, మరమ్మతుల కోసం మెకానిక్‌లు, ఇతర సిబ్బంది సేవలను కూడా తీసుకునేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.
సిబ్బంది నియామకానికి ఏర్పాట్లు
ఆర్టీసీ సమగ్ర విధానం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్, ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి, కొత్త సిబ్బంది నియామకం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న కండక్టర్పై 420 కేసు