తెలంగాణ

telangana

ETV Bharat / city

War Effect On TSRTC : బల్క్​లో కొంటే భారం.. బంకులకే పోదాం

War Effect On TSRTC : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ బస్సులు బంకులకు వెళ్లి డీజిల్​ పోయంచుకోవాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ఎప్పుడైనా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందన్న కారణంగా బల్క్​లో ఇంధనం కొన్నవారిపై లీటర్​పై 20 రూపాయలు అదనపు భారం చెల్లించాల్సి వస్తోంది. దీంతో రోజు రాత్రి బస్సులు డిపోలకు చేరే సమయంలో డీజిల్​ నింపాలని నిర్ణయించింది.

tsrtc city busses
tsrtc

By

Published : Mar 18, 2022, 10:52 AM IST

War Effect On TSRTC : ఇంధన భారం ఇప్పటికే ఆర్టీసీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. బల్క్‌(పెద్దమొత్తం)లో డీజిల్‌ కొంటే లీటరుకు రూ.20 అదనంగా భారం మోయాల్సిన పరిస్థితి. దీంతో సిటీ బస్సులన్నీ పెట్రోలు బంకులకు వెళ్లి ఏ రోజుకారోజు పోయించుకోవాల్సి వస్తోంది. నగరంలోని ప్రతి డిపోకు రెండు బంకులను కేటాయిస్తూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఆదేశాలు జారీ చేసింది.

2750 బస్సులు.. 1.4 లక్షల లీటర్లు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ పరిధిలో మొత్తం 2750 బస్సులున్నాయి. ఇవన్నీ రోడ్డెక్కుతున్నాయి. దీంతో రోజూ 1.40 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు రూ.1.33 కోట్లు వెచ్చించేవారు. గతంలో రిటైల్‌ కంటే కాస్త తక్కువ ధరకు లీటరు డీజిల్‌ దొరికేది. బల్కులో కొనేప్పుడు డీలర్‌ డిస్కౌంట్‌ పేరుతో లీటరుకు రూ.5-6 వరకు తగ్గేది. ఇలా నగరంలోని 29 డిపోల్లో పెట్రోలు బంకులుండేవి. ఆయా డిపోల బస్సులు ట్యాంకు నిండా ఇంధనం నింపేసుకుని రోడ్డెక్కేవి.

యుద్ధ ప్రభావం..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఎప్పుడైనా ఇంధన కొరత ఏర్పడొచ్చునని.. ఇంధనం భారీగా నిల్వ చేసుకుని తర్వాత అమ్ముకునే వెసులుబాటు ఎవరికీ కల్పించకుండా.. కేంద్రం బల్క్‌లో కొన్నవారిపై లీటర్‌ దగ్గర రూ.20 అదనపు భారం మోపింది. బల్క్‌లో కొంటే ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌పై రోజుకు రూ.1.61 కోట్లు అవుతుంది. రోజుకు రూ.28లక్షలు ఆర్టీసీపై భారం పడే అవకాశం ఉంది. దీనిని తప్పించుకోడానికి ఆర్టీసీ సిటీ బస్సులు బంకుల బాట పట్టాయి.

విధులు ముగించేటప్పుడే..

పెట్రోలు బంకులు పగలంతా రద్దీగా ఉంటాయి. ఒక బస్సు వెళ్తే ఇతర వాహనదారులకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. రాత్రి విధులు ముగించేప్పుడు బస్సుల్లో డీజిల్‌ నింపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. 29 డిపోలకు చేరువలోని రెండు బంకులను ఎంపిక చేసుకుని అక్కడే ఇంధనం నింపించాలని గ్రేటర్‌జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీచేశారు. అవకతవకలకు వీలు లేకుండా.. విజిలెన్సు, అకౌంట్స్‌ సెక్షన్‌ అధికారితోపాటు ప్రతి డిపోలోని ఇంధన విభాగానికి చెందిన ఉద్యోగి పర్యవేక్షణలో బస్సుల్లో ఇంధనం నింపుతారని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఇలాగే పెట్రోలు బంకుల్లో ఆర్టీసీ బస్సులకు డీజిల్‌ నింపిస్తామని వివరించారు.

ఇదీచూడండి:సుందర దేశం ధ్వంసం.. భావోద్వేగ వీడియో షేర్ చేసిన జెలెన్​స్కీ

ABOUT THE AUTHOR

...view details