Nama Nageshwara rao Comments: తెలంగాణ రైతాంగంపై ఎందుకంత కక్ష సాధిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని తెరాస ఎంపీలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక మాట.. కేంద్రంలో మరోమాట మాట్లాడుతూ భాజపా నేతలు రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు దిల్లీకి వస్తే.. 'మీకేం పని లేదా.. ఎందుకు దిల్లీ వస్తున్నారు..?' అని తెరాస మంత్రులు, ఎంపీలను అవమానించే విధంగా కేంద్ర మంత్రులు మాట్లాడారని ధ్వజమెత్తారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో తెరాస ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంపై ఎందుకంత వివక్ష?
'తెలంగాణ భారతదేశంలోనే ఉంది కదా.. అలాంటప్పుడు రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకంత వివక్ష? కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పుడు.. మా విషయంలో కేంద్రం తన బాధ్యతలు నిర్వర్తించాలి. తెలంగాణ రైతులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా ప్రయత్నం చేశారు. ధాన్యం విషయంలో కేంద్రం విధానాలు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఏం చేయాలో మా ముఖ్యమంత్రికి బాగా తెలుసు. వారికి అండగా ఉంటాం.. రైతాంగాన్ని కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే.. ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. అలాంటి గడ్డ నుంచి వచ్చిన మేము వెనకడుగు వేసేది లేదు. తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.'- తెరాస ఎంపీలు
ఇదీ చూడండి: