MP Gorantla Madhav Nude Video Case Update: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో వెలుగులోకి వచ్చి 14 రోజులైంది. ఈ నగ్న వీడియోకాల్ వ్యవహారంపై విచారణ జరిపి త్వరగా తేల్చాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు డీజీపీని ఆదేశించినా దానిపై ఇప్పటివరకూ నిగ్గుతేల్చలేదు. ఇంకా కేసూ లేదు... దర్యాప్తూ లేదు. ఒరిజినల్ వీడియో ఉంటేనే దాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో నిర్ధారించగలరనేది మొన్న అనంతపురం ఎస్పీ, తాజాగా సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్ చెబుతున్న మాట. అలాంటప్పుడు ఆ ఒరిజినల్ వీడియో ఎక్కడుందో దర్యాప్తు చేసి, అది ఎవరివద్ద ఉందో గుర్తించి స్వాధీనం చేసుకోవాలి. దాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపాలి. కానీ పోలీసులు ఆ అసలు పని వదిలేసి కొసరు పని చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మాధవ్ తన ఫోన్ ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించినా సరే.. దాన్ని సీజ్ చేయలేదు. కానీ ఆ వీడియో నిజమైనేదనంటూ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ పేరిట చలామణిలో ఉన్న ధ్రువపత్రం అసలైనదా? కాదా? తేల్చాలంటూ ఫిర్యాదు అందితే మాత్రం.. ఆగమేఘాలపై స్పందించారు. అది అసలైన ధ్రువపత్రం కాదని... దాన్ని చలామణిలో పెట్టినవారిపై కేసూ నమోదు చేశారు. నగ్న వీడియోకాల్ వ్యవహారంలో ఎంపీ మాధవ్‌పై చిన్న ఆరోపణ వచ్చినా.. అది నిజం కాదని చెప్పటానికే అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలు విశ్లేషిస్తే ఇదే స్పష్టమవుతోంది.
సునీల్‌కుమార్ చెప్పింది: ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నివేదిక పేరిట చలామణిలో ఉన్న ధ్రువపత్రం అసలైనది కాదు. అసలైనది వారు మాకు పంపించారు. మా వద్ద ఉంది.
- ఈ ప్రశ్నకు బదులేది?: అసలైన ధ్రువపత్రాన్ని ఎందుకు విడుదల చేయలేదు? అందులో ఏముందో ఎందుకు వెల్లడించలేదు? అందులో ఉన్న విషయాల్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి?
సునీల్‌కుమార్:మాకొచ్చిన ఫిర్యాదుతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకే... ఆ ధ్రువపత్రం గురించి వివరాల కోసం జిమ్ స్టాఫర్డ్‌కు మెయిల్ పంపించాం.
- ఈ ప్రశ్నకు బదులేది?: అమెరికన్ ఫోరెన్సిక్ సంస్థ జారీచేసిన ధ్రువపత్రం అసలైనదో కాదో తేల్చటంలో ప్రదర్శించిన ఉత్సాహం, చూపించినవేగం ఎంపీ నగ్నంగా ఓ మహిళతో వీడియోకాల్‌లో మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో గురించి తేల్చటంలో పోలీసులు ఎందుకు చూపలేదు? అసలు దాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించకుండానే ఒరిజినల్ వీడియో లేకుండా అది నిజమో కాదో నిర్ధారించలేమంటూ ఎలా చెబుతారు?