amalapuram riots Latest news : కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. మంగళవారం నాటి ఉద్రిక్తత, విధ్వంస పరిస్థితులు చల్లారినా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అటు జిల్లా వాసుల్లో, ఇటు పోలీసు యంత్రాంగంలోనూ నెలకొంది. బుధవారం అమలాపురం పట్టణంలో కొంతసేపు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాలిపోయిన తమ ఇంటిని మంత్రి విశ్వరూప్ సతీసమేతంగా బుధవారం పరిశీలించారు. మరోవైపు.. మంగళవారంనాటి ఉద్రిక్త పరిస్థితులపై కోనసీమ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
రావులపాలెంలోనూ ఆందోళనలు మొదలయ్యే క్రమంలో.. వాటిని పోలీసులు అదుపుచేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలతో పాటు 1,400 మంది పోలీసులు అమలాపురంలో మోహరించారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో.. బెటాలియన్ అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీలు రవీంద్రనాథ్ బాబు, ఐశ్వర్య రస్తోగి, విశాల్ గున్నీ, రవిప్రకాశ్ తదితరుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. మంగళవారం రాత్రి నుంచి అమలాపురం అష్ట దిగ్బంధంలోకి వెళ్లింది.
చుట్టుపక్కల గ్రామాల్లోనూ పోలీసులు మోహరించడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం 11 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోకి వచ్చిన ప్రతి వాహనాన్నీ, వ్యక్తినీ ఆసాంతం ఆరా తీశాకే అనుమతించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు.
స్తంభించిన సేవలు
అమలాపురంలో ఉద్రిక్తత దృష్ట్యా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సాయంత్రానికి పునరుద్ధరించారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే ఆర్టీసీ బస్సులను బుధవారం తాత్కాలికంగా రద్దుచేశారు. ఇంటర్ పరీక్షలు, ఇతర అత్యవసరాల దృష్ట్యా 11 గంటల తర్వాత పునరుద్ధరించారు. వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసేశారు.
పెట్రోలు బాంబులతో దాడులు
మంగళవారం నాటి ఆందోళనలో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి పెట్రోలు బాంబులతో దాడులు చేసి ఆస్తులు దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాల్లో పెట్రోలు నింపి ఇళ్లపైకి, వాహనాలపైకి కొడుతూ నిప్పంటించినట్లు తెలుస్తోంది. కొందరు పథకం ప్రకారమే మద్యం దుకాణాల వద్ద, సినిమాహాళ్లలో వాహనాలు నిలిపి అక్కడి నుంచి ఉదయం ఆట విడిచిపెట్టిన తర్వాత ఆందోళనలో కలిశారనే ప్రచారం సాగుతోంది. మంగళవారం నాటి ఘటనలో మంత్రి విశ్వరూప్ నివాసం వద్ద ఒక జీపు, ఐదు ద్విచక్రవాహనాలు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిదగ్గర రెండు ద్విచక్రవాహనాలు.. కలెక్టరేట్ దగ్గర ఒక బస్సు, ఎర్రవంతెన దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
మొదలైన పోలీసు వేట
హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితులను గుర్తించడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో 46 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీట్లు, ఇతర నేరచరిత్ర ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఉద్విగ్నం.. ఉద్రిక్తత
దాడులతో దెబ్బతిన్న భట్నవిల్లిలో ఇంటికి మంత్రి విశ్వరూప్ బుధవారం తన భార్య బేబీ మీనాక్షితో కలిసి వచ్చారు. కాలిపోయిన ఇల్లు చూసి దంపతులు ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆయన అభిమానులు, అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ప్రతినిధులు... పోలీసులు, ఆందోళనకారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడున్న మచిలీపట్నం డీఎస్పీని మంత్రి అనుచరులు నిలదీశారు. దీంతో మంత్రి వారిని సముదాయించబోగా వారు శాంతించకపోవడంతో... ఇలాగైతే తాను వెళ్లిపోతానని మంత్రి అసహనం వ్యక్తం చేయడంతో వారు నెమ్మదించారు.
ప్రభుత్వానికి నివేదిక
అమలాపురంలో మంగళవారం నాటి ఉద్రిక్త పరిస్థితులపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు చోటుచేసుకున్న పరిణామాలను.. విధ్వంసం తీరును నివేదికలో పేర్కొన్నారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఈనెల 22న కోనసీమ జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమల్లోకి తెచ్చామన్నారు. కోనసీమ సాధన సమితి ఈ నెల 22న తలపెట్టిన ఆందోళనలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిలువరించామని, మరోమారు ఆందోళన విషయం ముందుగానే గుర్తించి ఈ నెల 24న ఉదయం 7 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా 5వేల మంది వరకు వచ్చారని, కొందరిని కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించడానికి అనుమతించేటప్పుడే బయట దాడులకు పాల్పడ్డారని తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి ప్రత్యేక బలగాలు రప్పించి నియంత్రించడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌తోపాటు.. ముమ్మిడివరం ఎమ్మెల్యే సోదరుడి టింబర్ డిపోలపై దాడులకు పన్నిన కుట్రను భగ్నం చేయగలిగామని నివేదికలో తెలిపారు.