కొవిడ్ మూడో దశ వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయల వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే వారు... ఇలా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న వారిని గుర్తించి మొదటగా టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. వీరికి టీకాల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ దిశగా సూపర్ స్ప్రెడర్ల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆ వివరాలు అందిన వెంటనే త్వరలోనే ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు
ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కొవాగ్జిన్ వేసుకున్న వారికి రెండో డోసును త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే టీకాల డోసులను బట్టి 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు.