శ్రీశైలం జలాశయం నుంచి మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు.
ఏపీపై కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
18:50 May 12
ఏపీపై కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు చేపట్టబోతోందంటూ తాము జనవరిలోనే బోర్డు దృష్టికి తీసుకొచ్చామని... బోర్డు కూడా ఈ విషయమై వివరాలు, నివేదిక కోరిందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు బోర్డు లేఖపై స్పందించని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పనుల కోసం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును చేపడుతోందని... ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం నుంచి జలాలను మళ్లిస్తూ కనీసం తెలంగాణను ఏ మాత్రం సంప్రదించలేదని లేఖలో ప్రస్తావించారు.
గణాంకాలు లేకుండానే
హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల మిషన్ భగీరథ పథకం, వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం శ్రీశైలంపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. మరో బేసిన్‌లోని నీటిని తరలించేందుకు ఏపీ చేపడుతున్న కొత్త ప్రాజెక్టు వల్ల బేసిన్‌లోని ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ లేకపోవడం వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అక్కణ్నుంచి జలాలను భారీగా ఇతర బేసిన్‌కు ఎలాంటి గణాంకాలు లేకుండా తరలిస్తోందని లేఖలో ప్రస్తావించారు.
నిలిపివేయాలి
బోర్డుకు కనీసం వివరాలు కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... పనులకు సంబంధించి పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసిందని అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం అక్రమమని, విభజనచట్టంలోని నిబంధనలకు విరుద్ధమన్న తెలంగాణ... అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. 203 ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా ప్రతిపాదిత రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 89వేల క్యూసెక్కులకు పెంచే పనులకు టెండర్లు పిలవడం, ఆమోదం తెలపడం లాంటి పనులను నిలిపివేయాలని బోర్డును కోరింది.