ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ అమలు, సంక్షోభ సమయంలో అవలంభించాల్సిన విధానంపై సుదీర్ఘంగా చర్చించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడింగిచాలని కేబినేట్ నిర్ణయించింది. కొవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్‌డౌన్ మినహా మరోమార్గం లేదని సీఎం అన్నారు. పక్షం రోజుల పాటు ప్రజలంతా స్వీయ నిర్భంధంలో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాక నెలాఖరు తర్వాత దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
వైద్యులపై దాడులా..
కరోనా ఎవరికి సోకినా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులపై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్యగా కేసీఆర్ అభివర్ణించారు.
పరీక్షల్లేవ్..
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరనీ పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేయాలని కేబినెట్ తీర్మానించింది. పదో తరగతి పరీక్షల విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవరసం లేదని భరోసానిచ్చారు.