CHALO NARSIPATNAM: అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతను నిరసిస్తూ... తెలుగుదేశం పార్టీ 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ నర్సీపట్నంలోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీలు హాజరయ్యే అవకాశం ఉండడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
'చలో నర్సీపట్నం'కు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు. అనకాపల్లిలో తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావును గృహ నిర్బంధం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ కన్వీనర్ మళ్ల సురేంద్ర నర్సీపట్నం వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అక్రమంగా నిర్బంధిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యన్నపాత్రుడే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర తెదేపా నేతలు అయ్యన్న కుటుంబానికి అండగా నిలిచారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత కక్షపూరిత చర్యల్లో భాగమేనని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ధ్వజమెత్తారు.