ఏపీలో పురపాలక ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందంటూ తెలుగుదేశం నేతలు (TDP COMPLAINT TO SEC)ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. తక్షణమే వారిని అడ్డుకోవాలంటూ అశోక్‌బాబు, బొండా ఉమ, బోడె ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. వైకాపా అక్రమాలపై తెలుగుదేశం ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొందరు తెలుగుదేశం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదు..
ఎన్నికల నిర్వహణ సజావుగా జరగట్లేదని అశోక్‌బాబు అన్నారు. వైకాపా నాయకులే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కమలాపురంలో ఏజెంట్లకు పాస్లు ఇవ్వలేదని.. గట్టిగా అడిగితేనే అందజేసినట్లు ఆయన వివరించారు. ఏపీలో ఎన్నికల కమిషన్ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. అలాగే పలుచోట్ల వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. ఈ విషయంపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని అశోక్ బాబు పేర్కొన్నారు. బోగస్ ఓట్లు వేసేందుకు వచ్చేవారిని అరెస్టు చేసి.. డీఎస్పీని బదిలీ చేయాలని కోరినా ప్రయోజనం లేదన్నారు. వైకాపా నేతలు చెప్పినట్లే పోలీసులు పనిచేస్తున్నారని.. ఓటర్లను ప్రలోభపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఎస్‌ఈసీ చర్యలు (TDP COMPLAINT TO SEC) తీసుకోవాలని డిమాండ్ చేశారు.