కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుని వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాలలో ఆరో రోజైన గురువారం ఉదయం స్వామివారు సన్నిధి నుంచి తిరుచ్చిపై విమాన ప్రదక్షిణంగా కల్యాణ మండపానికి చేరుకున్నారు. విశేష తిరువాభరణాలతో, పరిమళభరిత పూల మాలలతో సర్వాంగసుందరంగా అలంకృతులై హనుమంత వాహనాన్ని అధిరోహించారు. హనుమంతుడిపై వేంకటాద్రిరాముని అవతారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు బంగారు రథోత్సవం నిర్వహిస్తారు. కరోనా ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే... బంగారు రథం స్థానంలో సర్వభూపాల వాహన సేవను నిర్వహించింది.
శ్రీదేవీ, భూదేవీ సమేతంగా సర్వభూపాల వాహన సేవలో దర్శన మిచ్చిన స్వామి, అమ్మ వార్లకు ఆలయ అర్చకులు కర్పూర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గజవాహన సేవను వైభవంగా నిర్వహించారు. మలయప్పస్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.