ఎంపీ రఘురామ కేసులో.. కేంద్రం, సీబీఐకు సుప్రీం నోటీసులు
13:55 May 25
ఎంపీ రఘురామ కేసులో.. కేంద్రం, సీబీఐకు సుప్రీం నోటీసులు
ఎంపీ రఘురామ కేసులో సీబీఐ, కేంద్రానికి.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఎంపీ కుమారుడు భరత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తన తండ్రిని కస్టడీలో సీఐడీ అధికారులు హింసించారని భరత్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ అధికారుల తీరుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సీబీఐని ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది అనుమతి కోరారు. కస్టడీలో చిత్రహింసలపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని న్యాయవాది తెలిపారు. ప్రతివాదుల జాబితా నుంచి కొందరిని తొలగించేందుకు రోహత్గీ అనుమతి కోరారు. ఏపీ ప్రభుత్వం, డీజీపీని జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి కోరారు. ప్రతివాదుల జాబితాలో మార్పులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా లేకుండా చేయడంపై ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా పడింది.
ఇదీ చదవండి:వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం