తెలంగాణ

telangana

తెలిసినా ఇచ్చారు.. సమస్యల్లో పడ్డారు

By

Published : Jun 20, 2021, 8:49 AM IST

గతంలో బియ్యం ఇవ్వని మిల్లర్లకు మళ్లీ ధాన్యం ఇవ్వొద్దని తెలిసినా... రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు వారికే బియ్యం కేటాయించి ఇబ్బంది పడుతున్నారు. తీరా ఇప్పుడు చూస్తే రైతులకు సొమ్ముల చెల్లింపు పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

State Civil Supplies Department in trouble for not giving rice to millers and giving money to farmers
తెలిసినా ఇచ్చారు.. సమస్యల్లో పడ్డారు

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు. గతంలో బియ్యం ఇవ్వని మిల్లర్లకు మళ్లీ ధాన్యం కేటాయించకూడదని తెలిసినా లక్ష మెట్రిక్‌ టన్నులు ఇచ్చారు. తీరా ఇప్పుడు రైతులకు సొమ్ముల చెల్లింపు సమస్యగా మారింది. ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లోని మిల్లులకు తరలిద్దామంటే రవాణా, హమాలీ ఛార్జీలు భారమవుతాయి. స్వాహా చేసిన బియ్యం తాలూకు సొమ్మును రాబట్టుకుని.. తిరిగి ధాన్యాన్ని కేటాయించాలా? ఇతర మిల్లుల పేరిట నమోదు చేసి రైతులకు చెల్లించాలా? అన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ధాన్యాన్ని ఆయా మిల్లులకు ఎలా తరలించారన్నదీ ప్రశ్నార్థకంగానే ఉంది.

పైరవీలతోనే..!

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా బియ్యంగా మార్పించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి ఇస్తుంది. ఆ తరవాత కేంద్రం నిధులను విడుదల చేస్తుంది. 2019-20 యాసంగి సీజన్‌లో సుమారు 100 మంది మిల్లర్లు సుమారు రూ. 400 కోట్ల విలువ చేసే 1.02 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇవ్వకుండా పక్కదారి పట్టించారు. అందుకుగాను వారిని నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వారికి ధాన్యం కేటాయించకూడదని అధికారులు తొలుత నిర్ణయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో బియ్యం ఎగవేసిన కొన్ని మిల్లులకూ రాజకీయ నాయకుల ఒత్తిడితో కేటాయించారు. అదే ప్రాతిపదికన తమకూ ఇవ్వాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మిల్లర్లు వివిధ స్థాయుల్లో పైరవీలు చేయడంతో ధాన్యం కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

సమస్య పరిష్కారానికి కసరత్తు

మిల్లుల వద్ద ధాన్యం అన్‌లోడ్‌ చేసిన తరవాత పౌరసరఫరాల శాఖ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో రైతుల వివరాలు, బ్యాంకు ఖాతా, ఎంత ధాన్యం విక్రయించిందనేది నమోదు చేస్తారు. అనంతరం వారి బ్యాంకు ద్వారా ఖాతాల్లో సొమ్ము జమవుతుంది. బియ్యం ఎగవేసిన మిల్లుల వివరాలు నమోదు కాకుండా అధికారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఆయా మిల్లుల్లో అన్‌లోడ్‌ చేసిన ధాన్యం వివరాలను నమోదు చేయడం సాధ్యపడలేదు. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ వ్యవహారం కొలిక్కి వస్తేనే రైతులకు సొమ్ము జమవుతుంది.

ఇదీ చూడండి: తండ్రి అయ్యాకే తెలుస్తుంది నాన్న అంటే ఏమిటో..

ABOUT THE AUTHOR

...view details