చిన్నప్పటి నుంచీ భారత వైమానిక దళంలో చేరాలని కలలు కనేది స్నేహల్‌వర్మ. బీటెక్ పూర్తయ్యేనాటికి ఆమె మనసు మార్చుకుంది. కారణం రోజురోజుకీ తరిగిపోతున్న ప్రకృతి వనరులే! పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా ఎంబీఏ పూర్తి చేసింది. మంచినీటి వనరులను కాపాడాలన్న తపనతో ‘నేచర్ డాట్స్’ అనే అంకుర సంస్థను స్థాపించింది. ఈ కరోనా కల్లోల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా మత్స్యకారులకు చేపల దిగుబడి, ఎగుమతుల విషయంలో అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగుపూలు పూయించిందీ సంస్థ.
బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్
స్నేహల్‌వర్మ తండ్రి కేంద్ర రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్ కావడంతో ఆయనతోపాటే వారి కుటుంబం కూడా దేశమంతటా తిరగాల్సి వచ్చేది. అలా స్నేహల్ చదువు ఒక చోట సాగలేదు. ఇండోర్‌లోని రాజీవ్‌గాంధీ ప్రొద్యోగికి విశ్వవిద్యాలయంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన స్నేహల్ భోపాల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థలో ప్రోగ్రాం డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నదులు, మాగాణి భూములు, నదీజలాలకు సంబంధించి చట్టపరమైన అంశాలపై పనిచేసిన అనుభవాన్ని సంపాదించుకుంది. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఓ పర్యావరణ పరిరక్షణ సంస్థకు సలహాదారుగానూ పని చేసింది.
సాంకేతిక సాయం అండగా...
ఈ అనుభవంతోనే నేచర్ డాట్స్ అనే అంకుర సంస్థకు శ్రీకారం చుట్టింది. పర్యావరణం, నీటి వనరులను కాపాడేందుకు సాంకేతికతను అభివృద్ధి చేసి తద్వారా ఉపాధి అవకాశాలని పెంచడమే ఈ సంస్థ లక్ష్యం. నేచర్ డాట్స్... మొదట ఛత్తీస్‌గఢ్, ఝూర్ఖండ్‌లోని మత్స్యకారులతో కలిసి పనిచేసింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నీటివనరుల్లో పేరుకున్న మురికిని, కాలుష్యాన్ని తొలగించి మంచినీటి నాణ్యతను, చేపల దిగుబడినీ పెంచే దిశగా అడుగులు వేసింది స్నేహల్‌వర్మ. ఎప్పటికప్పుడు మత్స్య కారులకు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపింది.