ప్రభుత్వ అవినీతిని, అక్రమాల్ని ప్రశ్నించిన విపక్ష నాయకుల్ని అక్రమ కేసులు, సంకెళ్లతో అణచివేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ముసుగేసి.. రౌడీల్ని పిలిపించి కొట్టించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు డాక్టర్లతో తప్పుడు రిపోర్టు ఇప్పించారు. ఎంపీకి దెబ్బలు తగలడం వాస్తవమని సుప్రీంకోర్టే తేల్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాతైనా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.
- ఏపీ తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు డిమాండ్
ఓటు బ్యాంకు రాజకీయాలు మా విధానం. వాటి కోసమే పథకాలు ప్రవేశపెడతాం. ప్రజలకు బ్యాంకుల్లో డబ్బులు వేస్తూ ఉంటాం. మేం అధికారంలో కొనసాగుతుంటాం. రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి, భవిష్యత్తు మాకు అనవసరం. మాకు స్వల్ప కాలంలోనే లబ్ధి ఎలా చేకూరుతుందన్నదే మా ప్రభుత్వం, నాయకుడి ఆలోచనా విధానం. ఆ దిశగానే బడ్జెట్ ప్రవేశపెట్టాం. ప్రతిపక్ష సభ్యులు ప్రతిదానికీ శ్వేతపత్రం విడుదల చేయమంటే కుదరదు.
- తెదేపా మాక్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వ్యంగ్యాస్త్రాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై నిరసనగా ఆన్‌లైన్‌లో చేపట్టిన మాక్ అసెంబ్లీని తెదేపా శుక్రవారం రెండో రోజూ కొనసాగించింది. వ్యవసాయం-రైతు సమస్యలు, పేద, మధ్యతరగతి ప్రజల వ్యతిరేక బడ్జెట్, ప్రతిపక్షాలపై దాడులు, ప్రభుత్వ అవినీతి... అనే అంశాలపై చేపట్టిన చర్చలో పాల్గొన్న సభ్యులు ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌లోనూ... ఎన్నికల హామీల అమలు, దిశ బిల్లు, పింఛను పెంపు, ధరల పెరుగుదల వంటి... 20 అంశాల్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై... మంత్రులుగా వ్యవహరించిన నాయకులు వ్యంగ్యంగా సమాధానాలిచ్చారు. మాక్ అసెంబ్లీలో వివిధ అంశాలపై నేతలు చేసిన వ్యాఖ్యలు ఇవి..!
అప్పులు తీర్చడానికే రుణాలు తేవాల్సొస్తుంది: యనమల
‘‘ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే... భవిష్యత్తులో వాటిని తీర్చడానికి, వడ్డీలు కట్టడాఏడాదికి రూ.లక్ష కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుంది. రెండేళ్లలో ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసింది. మొత్తం అప్పులు రూ.4.47 లక్షల కోట్లకు చేరాయి. భవిష్యత్తులో అప్పులు తీర్చడానికే రుణాలు తీసుకు రావలసిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారు. రాష్ట్రంలో వృద్ధి రేటు -2.58గా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అది -5 శాతానికి చేరే అవకాశముంది. ద్రవ్యలోటు కూడా 5% కంటే ఎక్కువ ఉంది’’ అని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడారు.
విశాఖ ఉక్కుపై మొక్కుబడి తీర్మానమా?
మాక్ అసెంబ్లీ మొదలైన వెంటనే సభాపతిగా వ్యవహరించిన డీబీవీ స్వామి ప్రశ్నోత్తరాల్ని ప్రారంభించగా.. లోకేష్ జోక్యం చేసుకుని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, చర్చించాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. దాన్ని కాపాడేందుకు రాష్ట్రం మొక్కుబడి తీర్మానం చేసి కేంద్రానికి పంపించటం సరికాదు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఐకాస పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇస్తూ సభ తీర్మానాన్ని ఆమోదిస్తోంది’’ అని తీర్మానం చదివి వినిపించారు. దీనిపై పీవీజీఆర్ నాయుడు (గణబాబు) మాట్లాడారు.
రైతులకు హక్కు లేకుండా చేస్తున్నారు: కేశవ్
‘‘రైతుల పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందనే ముసుగులో... వారికి పెట్టుబడి రాయితీ గురించి అడిగే హక్కు లేకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఉత్పత్తుల్ని రోడ్డున పడేసే పరిస్థితులున్నా... ఆ సమస్యలపై కనీసం ఒక్క గంటసేపైనా చర్చించేందుకు ప్రభుత్వానికి ఎందుకు మనసు రాలేదు?’’ అని పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై నిమ్మల రామానాయుడు మాట్లాడారు.