తెలంగాణ

telangana

ETV Bharat / city

ONE RUPEE DOSA: దోశ @ RS 1.. ఎక్కడో తెలుసా..!

ONE RUPEE DOSA: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కాల్వగడ్డ వీధికి చెందిన సావిత్రమ్మ ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. సుమారు 40 ఏళ్లుగా ఆమె నామమాత్రపు ధరకు దోశలు, వడలు, పొంగనాలు అమ్ముతోంది. తన కష్టానికి దక్కిన ఆదాయంతోనే ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం విశేషం.

ONE RUPEE DOSA, SAVITRAMMA DOSA
దోశ @ ఒక్క రూపాయి

By

Published : Dec 29, 2021, 9:43 AM IST

ONE RUPEE DOSA: మార్కెట్లో సరకులు, వస్తువుల ధరలు మండుతున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని కాల్వగడ్డ వీధికి చెందిన సావిత్రమ్మ ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. సుమారు 40 ఏళ్లుగా ఆమె నామమాత్రపు ధరలకు దోశలు, వడలు, పొంగనాలు అమ్ముతోంది. కర్నూలుజిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన సావిత్రమ్మ దాదాపు 45 ఏళ్ల క్రితం భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం తాడిపత్రి పట్టణానికి వచ్చారు. భర్త టీ కొట్టు దుకాణం నిర్వహించేవాడు. అతనికి చేదోడుగా సావిత్రమ్మ 1980 సంవత్సరంలో దోశలు వేయడం ప్రారంభించింది. అప్పట్లో ఒక్క రూపాయికి నాలుగు దోశలు ఇచ్చేది. క్రమేణా ధరలు పెరగడంతో రూ.1కి రెండు దోశలు ఇచ్చింది. కిరోసిన్‌, కట్టెల కొరతతో ప్రస్తుతం గ్యాస్‌ పొయ్యి మీద దోశలు వేస్తూ రూ.1కి దోశతోపాటు రెండు రకాల చట్నీలు ఇస్తోంది.

ఉదయమే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు ఆమె దుకాణం వద్దకు వచ్చి దోశలు తిని వెళ్తుంటారు. రోజుకు 500కుపైగా దోశలు విక్రయిస్తుంది. అదేవిధంగా సాయంత్రం రూ.10కు ఆరు బజ్జీలు, రూ.10కి 10 పొంగనాలు విక్రయిస్తోంది. ఇలా రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకూ సంపాదిస్తున్నట్లు సావిత్రమ్మ తెలిపారు. 16 ఏళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. అయినా ధర పెంచలేదు. తన కష్టానికి దక్కిన ఆదాయంతోనే ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం విశేషం.

ఆకలి తీర్చడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది

'తక్కువ ధరకే టిఫిన్‌ విక్రయించి పలువురి ఆకలి తీర్చడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ వయసులో ఎందుకు కష్టపడతావు, మానేయమని ఇంట్లో వాళ్లు చెబుతున్నారు. నాకు శక్తి ఉన్నన్నాళ్లూ దోశలు వేసి విక్రయిస్తానని చెప్పా. నా వద్ద 10 దోశలు తింటే చాలు వారికి ఆకలి తీరిన తృప్తి.. నాకు తక్కువ ధరకే కడుపు నింపాననే సంతృప్తి దొరుకుతుంది. దాతలు సాయం అందిస్తే మరింత మంది ఆకలి తీరుస్తా.' - సావిత్రమ్మ

ఇదీచదవండి:వడ్డీ వ్యాపారుల దోపిడీ.. రుణం పేరుతో విలువైన భూములు స్వాహా

ABOUT THE AUTHOR

...view details