సాంకేతిక హంగులతో రోబోటిక్ రెస్టారెంట్లు దూసుకువస్తున్నాయి. కరోనా మహమ్మారి నేర్పిన భౌతిక దూరం పాఠంతో రెస్టారెంట్లలో రోబోలు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రధాన నగరాలకే మాత్రమే పరిమితమయిన రోబో రెస్టారెంట్లు రాష్ట్రంలోనూ క్రమేణా పెరుగుతున్నాయి. విజయవాడలోని ఓ రెస్టారెంట్లో కొత్తగా ప్రవేశ పెట్టిన రోబోలు వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. లోనికి వచ్చే అతిథులకు స్వాగతం పలకడం, సిద్ధం చేసిన ఆహారాన్ని నేరుగా వారి టేబుల్ వద్దకు తీసుకెళ్లి అందించడం వంటి సేవలు చిన్నారులతో పాటు, పెద్దలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Robot: రోబో రెస్టారెంట్... ఆర్డర్ ఇస్తే నిమిషాల్లోనే!
హాయ్.. మా హోటల్‌కు వచ్చిన అతిథులకు స్వాగతం. రండి రండి వెళ్లి కూర్చొండి. మీరేం తింటారో చెప్పండి. మీకేం కావాలో తెచ్చిస్తాం. ఈ మాటలనేది మనుషులు కాదండోయ్... మరమనుషులు. అదేంటి సర్వర్లు కదా ఈ ప్రశ్నలు వేసేది అనుకుంటున్నారా..? రోబోలు ఆహ్వానించడమేంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఇది చదవండి.
ఏపీ విజయవాడతో పాటు ఒంగోలు, రాజమండ్రి రెస్టారెంట్లలో ప్రయోగాత్మకంగా రోబో సేవలు మొదలయ్యాయి. ఒక్కో రోబో ఖరీదు ఆరు లక్షల వరకూ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ రోబోలు కిచెన్‌లో తయారైన వంటకాలను నేరుగా వినియోగ దారుల టేబుల్ వద్దకు చేరుస్తున్నాయి. భోజనప్రియులను ఆకట్టుకుంటున్న ఈ రోబోలు పుడ్ సెర్వింగ్‌లో వినియోగదారులకు కావాల్సిన ఆహారాన్ని నేరుగా వాటికే చెప్పుకునే వెసులుబాటు ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతానికి ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చే సదుపాయమే వాడుకలో ఉంచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.