తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీస్​ శాఖ వైపు అబ్బాయిలు.. వ్యవసాయం వైపు అమ్మాయిలు!

ఇంజినీరింగ్​ చదువంటే మక్కువ ఉన్నా... ఆ రంగంలో విస్తృతంగా అవకాశం ఉన్నా.. కేవలం కొద్ది శాతం మంది మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగిన సామర్థ్యాలు కొద్ది మందిలోనే ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. విద్యార్థులు కొన్ని రంగాలపై ఆసక్తి కనబరుస్తున్నా.. ఆదిశగా నైపుణ్యాలు లేవని స్పష్టమైంది.  రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన సైకోమెట్రిక్‌ పరీక్షల్లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి.

psychometric test on students in residential schools in telangana
పోలీస్​ శాఖ వైపు అబ్బాయిలు.. వ్యవసాయం వైపు అమ్మాయిలు

By

Published : Dec 4, 2019, 9:41 AM IST

ఇంజినీరింగ్‌ సంబంధించిన రంగాల్లో స్థిరపడేందుకు కేవలం 19 శాతం మందే ఆసక్తి చూపుతున్నారు. అందులో 11 శాతం అబ్బాయిలు, 8 శాతం అమ్మాయిలున్నారు. అయితే మొత్తం విద్యార్థుల్లో ఇంజినీరింగ్‌ రంగానికి అవసరమైన వ్యక్తిత్వ లక్షణాలు, నైపుణ్యాలు 18 శాతం మందిలోనే ఉండటం గమనార్హం. అబ్బాయిల్లో అత్యధికంగా 27 శాతం మంది పోలీసు వృత్తిపై ఆసక్తి చూపగా, అమ్మాయిల్లో మాత్రం అత్యధికంగా 20 శాతం మంది వ్యవసాయం, ఆహార పరిశ్రమ రంగాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నట్లు వెల్లడైంది.

కెరీర్​ గైడెన్స్​..

తల్లిదండ్రుల ఒత్తిడి, ఇతర కారణాలతో ఆసక్తి లేని కోర్సుల్లో చేరి రాణించలేకపోయిన వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారానికి పదో తరగతి విద్యార్థులపై మనోమాపన(సైకోమెట్రిక్‌) పరీక్షలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఏ రంగంపై ఆసక్తి ఉంది? అందుకు అవసరమైన సామర్థ్యాలున్నాయా? ఏ రంగంలో రాణించేందుకు అవకాశముంది? తదితర అంశాలపై స్పష్టత వస్తే కెరీర్‌ను ఎంచుకోవచ్చని, లోపాలను సవరించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఏయే రంగాలు సరిపోతాయి..

రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లోని 18 వేల మంది పదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్‌పై పరీక్షలు నిర్వహించింది. ఐఐటీ మద్రాస్‌ ఇంక్యుబేటర్‌ కేంద్రం నుంచి వచ్చిన స్టార్టప్‌ కంపెనీ బోథ్‌ బ్రిడ్జి పరీక్షలను జరిపింది. ఆసక్తి ఉన్న మూడు రంగాలను ఎంచుకున్నాకా ఒక్కో విద్యార్థికి 72 ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రకారం విశ్లేషించారు. నర్సు, వృద్ధాశ్రమాలు, సైకాలజిస్టు, వినోదం, ఆతిథ్యం-పర్యటకం, విద్యా-శిక్షణ, న్యాయవిద్య, ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌, మార్కెటింగ్‌, జర్నలిజం, సేల్స్‌, పారా మెడికల్‌, ఆర్థికం, ఐటీ సంబంధిత రంగాలు రాష్ట్ర విద్యార్థులకు తగినవని నివేదిక స్పష్టం చేసింది.

ప్రధాన వ్యక్తిత్వ, కెరీర్‌ లోపాలు..

  1. ఎక్కువ రిస్కు తీసుకొనే మనస్తత్వం ఉన్నవారు 2 శాతమే. 61 శాతం మందిలో అది చాలా తక్కువ.
  2. విశ్లేషణాత్మక సామర్థ్యం ఎక్కువ ఉన్నవారు 11 శాతం. 27 % మందిలో ఇది స్వల్పం.
  3. సొంత ఆలోచన చేసే మనస్తత్వం ఎక్కువగా ఉన్నవారు 8 శాతం. 37 శాతం మందిలో అది చాలా తక్కువ.
  4. చదివిన అంశంపై సొంతగా ఆలోచించే నైపుణ్యం కేవలం 11 శాతం మందిలోనే అధికంగా ఉంది. 24 శాతం మందిలో అతి తక్కువుగా ఉంది.
  5. సృజనాత్మకత, ఇతరులపై సానుభూతి చూపడం, తన భావాన్ని సమర్థంగా వెల్లడించే నైపుణ్యం విద్యార్థుల్లో బాగుందని నివేదిక వెల్లడించింది.

ఇవీచూడండి: విద్యార్థినులకు 3నెలల పాటు మార్షల్‌ ఆర్ట్స్ శిక్షణ

ABOUT THE AUTHOR

...view details