తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్డగోలు వసూళ్లు.. సర్కారు ఆదేశాలు బేఖాతరు

కొవిడ్‌ సోకిన ఓ మహిళ (52)కు ఆయాసంగా ఉండడం వల్ల.. అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. పేరున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎక్కడా పడకల్లేవన్నారు. తెలిసిన వారి ద్వారా ఎట్టకేలకు ఒక ఆసుపత్రి ఐసీయూలో పడక లభించింది. అయితే ముందే షరతులు పెట్టారు. బీమాను అంగీకరించేది లేదనీ, మొత్తం బిల్లులో కనీసం సగం నగదు రూపేణా చెల్లించాలనే ఒప్పందంతోనే పడక కేటాయించారు.

private hospitals Disobeying government orders
private hospitals Disobeying government orders

By

Published : Apr 19, 2021, 5:02 AM IST

కొవిడ్‌తోపాటే రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీలో ‘రెండోదశ ఉద్ధృతి’ మొదలైంది. కొన్ని ఆసుపత్రులు డబ్బు కడితేనే చికిత్స అందిస్తున్నాయి. కనీసం రూ.లక్ష ముందుగా చెల్లించకపోతే.. చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నాయి. దీంతో రోగులు అప్పుల పాలు కావాల్సి వస్తోంది. మరికొన్ని ఆసుపత్రుల్లో నగదు మాత్రమే కట్టాలని పట్టుబడుతున్నారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లిస్తే.. ఆ డబ్బుకు పన్ను చెల్లించాల్సి రావడంతో.. ఈ ‘నగదు’ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఇటు రోగుల ముక్కు పిండి వసూలు చేస్తున్నా అవి మాత్రం పన్ను ఎగ్గొడతాయన్నమాట. ఏడాది కిందటే ప్రభుత్వం కరోనా చికిత్సలకు ధరలను ఖరారు చేసినా.. ఎక్కడా వాటిని అమలు చేయడంలేదు. కరోనా చికిత్సల పేరిట అడ్డగోలుగా రుసుములు వసూలు చేయొద్దనీ, మానవతా దృక్పథంతో చికిత్సను అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులకు విజ్ఞప్తి చేసినా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోగులను నిలువుదోపిడీ చేస్తున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు.

సర్కారీ నిబంధనలేమిటి?

గతేడాది కరోనా తొలి దశలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై వందలాది ఫిర్యాదులు రావడంతో హైకోర్టు కూడా పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. చివరకు ప్రభుత్వం చికిత్సల ధరలను ఖరారు చేసింది. ఐసొలేషన్‌లో అయితే ఒకరోజు చికిత్సకు రూ. 4,000, ఐసీయూలో రూ. 7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ. 9,000 చొప్పున వసూలు చేయాలని స్పష్టం చేసింది. రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, సి.. తదితర పరీక్షల ఖరీదును, కొన్ని సాధారణ ఔషధాలను కూడా ఇందులో చేర్చింది. అయినా ఆ ధరలు అమలు కాలేదు. ఈ విషయంపై గతేడాది వైద్య ఆరోగ్యశాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. అధికారులు కేవలం ఒకట్రెండు ఆసుపత్రులపై తాత్కాలిక చర్యలు తీసుకొని తూతూమంత్రంగా ముగించారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. నెల రోజులుగా కరోనా రెండోదశ ఉద్ధృతిలోనూ కార్పొరేట్‌ ఆసుపత్రులు దోపిడీకి మొదలుపెట్టాయి. ఐసొలేషన్‌ వార్డులకు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి.

కాస్త ఉదారత చూపండి: ఐఎంఏ వినతి

కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతంగా ఉన్నందున.. కరోనా రోగుల పట్ల ప్రైవేటు ఆసుపత్రులు ఉదారంగా వ్యవహరించాలని భారతీయ వైద్యుల సంస్థ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లవ్‌కుమార్‌రెడ్డి, ఎలెక్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బీఎన్‌ రావు ఒక ప్రకటనలో కోరారు. పేద రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: మార్కెట్లలో కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యం... తప్పదు భారీ మూల్యం

ABOUT THE AUTHOR

...view details