PG Medicine Seats : పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో యాజమాన్య కోటాలో సీట్లను బ్లాక్ చేసే వ్యవహారాన్ని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు ఏళ్లుగా కొనసాగిస్తున్నాయనే విమర్శలున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు సరైన విచారణ చేయకపోవడంతో ఈ వ్యవహారం వ్యవస్థీకృతం అయిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారాన్ని కొన్ని కళాశాలలు పకడ్బందీగా నడిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో మంచి ర్యాంకులు సాధించిన కొందరు అభ్యర్థుల పేరిట అన్ని విడతల్లోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి. ఆ మేరకు ఆయా అభ్యర్థులతో ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక దళారీ వ్యవస్థ రాష్ట్రంలో పనిచేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం.. వైద్యవిద్య ప్రవేశాల్లో ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, వైద్య సంస్థ కేటగిరీల్లోని సీట్లను నీట్ ర్యాంకుల ప్రాతిపదికన కాళోజీ ఆరోగ్య వర్సిటీ భర్తీ చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం 2,295 పీజీ సీట్లుండగా, వీటిలో అఖిల భారత కోటాలో 512 సీట్లను భర్తీచేస్తున్నారు. 1,090 సీట్లను కన్వీనర్ కోటాలో నింపుతున్నారు. ‘‘మిగిలిన 693 యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనే అక్రమ దందా నడుస్తోంది. యాజమాన్య కోటా సీటు ధర రూ.23-24 లక్షలుండగా..ప్రవాస భారతీయ, వైద్య సంస్థ కేటగిరీ సీటుకు అధికారికంగానే రూ.69-72 లక్షల వరకూ స్వీకరించవచ్చు. ఈ కోటాలో ప్రతి విడతలోనూ ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ధరఖాస్తు చేయించి.. సీటు వచ్చినా చేరకుండా చేయడం ద్వారా కొన్ని కళాశాలలు సీట్లను మిగుల్చుకుంటున్నాయి. మొత్తం సీట్లలో దాదాపు 40 శాతం సీట్లను ఖాళీగా ఉండేలా చూసుకుని రూ.కోట్లకు అమ్ముకుంటున్నాయని’ వర్సిటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఏడాది ఈ వ్యవహారాన్ని నడపడంలో ఏడు ప్రైవేటు వైద్య కళాశాలల పాత్ర ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని విడతల కౌన్సెలింగ్‌లో ఈ ఏడు కళాశాలల్లోనే ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నట్లుగా వర్సిటీ ప్రాథమిక దర్యాప్తులోనూ వెల్లడైనట్టు తెలిసింది.