తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​ని వీడని వరదలు... భోజనం, తాగునీరు లేక అవస్థలు

చుట్టూ నీరు..మోకాలు లోతు బురద.. ఇళ్లలోకి చొరబడుతున్న ఎలుకలు, పందికొక్కులు.. తడిసిన బియ్యం.. వ్యర్థాల నుంచి వెలువడుతున్న దుర్వాసన.. వెరసి ఏ ఇంట్లోనూ వెలగని పొయ్యి..అందని ఆహారం.. అయోమయంగా జీవనం... వర్షం తెరిపినిచ్చిన మూడురోజుల తర్వాతా రాజధానిలోని చాలా కాలనీల్లో బాధితుల దయనీయ స్థితి ఇలా ఉంది.

people struggling with floods in hyderabad
రాజధానిని వీడని వరదబాధలు... భోజనం, తాగునీరు అందక జనం అవస్థలు

By

Published : Oct 17, 2020, 6:30 AM IST

హైదరాబాద్‌ మహానగర వాసులకు వర్షం తీరని వ్యథను మిగిల్చింది.మంగళవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షంతో దాదాపు 2 వేల కాలనీలు వరదలో చిక్కుకోగా ఇప్పటికీ వెయ్యికిపైగా కాలనీలు నీటిలోనే మగ్గుతున్నాయి. ముంపు నుంచి బయటపడ్డ మరో వెయ్యి ప్రాంతాల్లో.. ప్రజలు మురుగును శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారిని పలకరిస్తే కన్నీరే సమాధానంగా వస్తోంది. ఇంట్లో పొయ్యి వెలిగించుకోలేని పరిస్థితులున్నా అధికారులు భోజనం, తాగునీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఎలాగోలా దాహం తీర్చుకుందామని నల్లా విప్పితే మురుగునీరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలీనగర్‌, మూసానగర్‌, గగన్‌పహాడ్‌, ఉప్పుగూడ, హరిహరపురం, అల్వాల్‌, రామంతాపూర్‌ పెద్దచెరువు ప్రభావిత కాలనీ, ఇతరత్రా ప్రాంతాల్లో ఈ దుస్థితి కనిపిస్తోంది.

నిత్యావసరాలు తెచ్చుకోలేక..

సమీప కాలనీలకు వెళ్లి తాగునీరు, నిత్యావసరాలు తెచ్చుకుందామంటే వాహనాలు పనిచేయట్లేదు. నడుచుకుంటూ వెళ్లేందుకు బురద అడ్డుపడుతోంది. ఎల్బీనగర్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, రామ్‌నగర్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, పాతబస్తీ, నాంపల్లిలోని ప్రభావిత కాలనీల్లో ఈ పరిస్థితి ఉంది.

దయనీయంగా ఉమామహేశ్వరకాలనీ

కొంపల్లి మున్సిపాలిటీ ఉమామహేశ్వరకాలనీ వాసుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువు వరదతో ఈ కాలనీ ఇంకా జలమయమై ఉంది. మొత్తం 642 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి. ఏలూరు నుంచి జీవనోపాధికి వచ్చిన మత్స్యకారుల 10 కుటుంబాల వారి గుడిసెలు నీట మునిగాయి. తినేందుకు ఏమీ లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ముగ్గురి కోసం గాలింపు

నగర శివారు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ అలీనగర్‌ వద్ద వరదనీటిలో కొట్టుకుపోయిన కుటుంబ సభ్యుల్లో శుక్రవారం మరొకరి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 13న మూసీవాగు వరదనీటిలో 8 మంది గల్లంతయ్యారు. బుధ, గురువారం గాలింపు చర్యల్లో నాలుగు మృతదేహాలు లభించాయి. శుక్రవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో గల్లంతైన వారిలో ఐదుగురు మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంకా అంధకారంలోనే..

నగరంలోని చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. రామంతాపూర్‌లో ముంపు నీరు అలాగే ఉంది. పెద్ద చెరువు, చిన్నచెరువు పొంగి పొర్లుతుండటంతో సాయి చిత్రనగర్‌, రవీంద్రనగర్‌, ఇతర ప్రాంతాల్లోని 500 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. మొదటి అంతస్తు వరకు నీరు చేరడం వల్ల విద్యుత్తు లేక నాలుగు రోజులుగా అక్కడ అంధకారమే ఉంది. స్థానిక ఈఎస్‌ఐ ఆస్పత్రి కూడా వరదలో మునగడంతో రోగులకు మందులు కూడా లభించట్లేదు. బస్టాండ్లు, పునరావాస కేంద్రాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో మూడ్రోజులుగా తలదాచుకున్న బాధితులు కొందరు ఇంటికి తిరిగొచ్చి శుభ్రం చేసుకుంటున్నారు. నగరంలో 35 వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు.

ఇవీ చూడండి:3 రోజులు దాటినా నీటిలోనే పలు కాలనీలు

ABOUT THE AUTHOR

...view details