రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌ను వాయుమార్గంలో తీసుకొస్తోంది. ఒడిశా నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ను కేటాయించింది. రైల్వే, రహదారి మార్గమైతే ఆలస్యమవుతుందన్న భావనతో వాయుమార్గంలో తరలించనున్నారు. ఇందుకోసం సైనిక విమానాలను ఉపయోగిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి సైనికవిమానాల ద్వారా వాయుమార్గంలో రాష్ట్రానికి ఆక్సిజన్‌ను తరలిస్తారు. 14.5 మెట్రిక్ టన్నుల పరిమాణం కలిగిన ఎనిమిది ఖాళీ ట్యాంకులను ఇక్కణ్నుంచి తీసుకెళ్లి ఆక్సిజన్ నింపి తిరిగి ఇక్కడకు తీసుకొస్తారు.
భువనేశ్వర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్
10:24 April 23
రాష్ట్రానికి సైనిక విమానాల్లో ఆక్సిజన్ సరఫరా
రాష్ట్రంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోంది. వేల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్ కరోనా ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నందున ప్రాణవాయువు ఈ చికిత్సలో అత్యంత కీలకంగా మారింది. అందువల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ కొరత తీర్చడానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్ నుంచి సైనిక విమానాల్లో ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు. సత్వరమే ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటి సరిగా ఈ ప్రయత్నం చేసిందని మంత్రి ఈటల అన్నారు.
మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్ కుమార్‌లను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. మూడు రోజుల సమయంతో పాటు ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు.
- ఇదీ చదవండి :60శాతం ఆక్సిజన్ మీదే ఆధారం