Financial Burden on Discoms: విద్యుత్ డిమాండు పెరిగినప్పుడు రోజూవారీ అవసరాలకు ఇంధన ఎక్స్ఛేంజీలో కరెంటు కొంటున్న తెలుగు రాష్ట్రాలపై మరింత ఆర్థికభారం పడనుంది. ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’(ఐఈఎక్స్)లో విక్రయించే కరెంటు గరిష్ఠ ధరపై ప్రస్తుతమున్న పరిమితి(సీలింగ్) ఎత్తివేసి ఏ రోజుకారోజే నిర్ణయించాలని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం ఐఈఎక్స్‌లో ఏరోజైనా కరెంటు యూనిట్ గరిష్ఠ విక్రయ ధర రూ.12కు మించకూడదనే సీలింగ్ నిబంధన ఉంది. దీనివల్ల ఎక్కువ వ్యయంతో విద్యుదుత్పత్తి చేస్తున్నవారు ఐఈఎక్స్‌లో కరెంటు విక్రయాల్లో పాల్గొనలేకపోతున్నందున గరిష్ఠధరకు సవరణ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్రతిపాదనతో.. దేశంలో విద్యుత్‌ను ఎక్స్ఛేంజీలో అమ్ముకునే ‘విద్యుదుత్పత్తి కేంద్రాల’(జెన్‌కో)కు లాభదాయకం కాగా రోజూ కొనే రాష్ట్రాల డిస్కంలపై మరింత ఆర్థికభారం పడనుంది. మరుసటి రోజు కరెంటు అవసరమైన విద్యుత్ కొనుగోలు సంస్థలు గరిష్ఠ ధరలను కోట్ చేస్తూ ముందురోజు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఐఈఎక్స్‌కు ప్రతిపాదనలివ్వాలని కేంద్రం సూచించింది. వాటిని పరిశీలించి అదేరోజు సాయంత్రం 5.30కల్లా తుది ధరలను జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం ప్రకటిస్తుందని తెలిపింది. దీనివల్ల ప్రతీరోజు విద్యుత్ గరిష్ఠ డిమాండు ఉన్న సమయంలో ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి జెన్‌కోలకు అవకాశం కలుగుతుంది. ఏ రాష్ట్రంలో అయితే డిమాండుకు తగినంత కరెంటు లేక లోటు ఉంటుందో వారు మాత్రమే ఎక్కువ ధరలను కోట్ చేసి కొనుగోలు చేస్తారని, మిగతా కొనుగోలుదారులపై ప్రభావం ఉండదని కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, సూచనలైనా ఈ నెల 21లోగా పంపాలని కోరింది.
రూ.20 నుంచి రూ.12కి తగ్గించి...గతంలో గరిష్ఠ ధర ఎంత ఉండాలనే నిబంధన లేదు. దీనివల్ల కొద్ది నెలల క్రితం వరకూ గరిష్ఠ ధర ఏరోజుకారోజు విపరీతంగా పెరిగి ఒకదశలో యూనిట్‌ను రూ.20కి విక్రయించారు. గత ఏప్రిల్‌లో యూనిట్ రూ.20కి తెలుగు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కొన్నాయి. దీనివల్ల తమపై తీవ్ర ఆర్థికభారం పడుతోందని, గరిష్ఠ ధరపై సీలింగ్ ఉండాలని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల డిస్కంలు ఐఈఎక్స్‌ను కోరాయి. ఈ మేరకు రూ.12 మించకూడదని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి గతంలో ఆదేశాలిచ్చింది. దీనివల్ల తాము ఎక్కువ ధరలకు అమ్ముకోలేకపోతున్నామని కొన్ని విద్యుదుత్పత్తి సంస్థలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
విద్యుత్ గరిష్ఠ డిమాండు పెరిగినప్పుడు రోజూవారీ అవసరాలకు ఐఈఎక్స్‌లో అధిక ధరలను కోట్ చేసి డిస్కంలు కొనడం ఆనవాయితీ. గరిష్ఠ ధర సీలింగ్ పెంచితే వీటిపై అదనపు ఆర్థికభారం పడుతుంది. ఇలా అధిక ధరలకు కొనడం వల్ల పడే ఆర్థికభారాన్ని చివరికి కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల నుంచే డిస్కంలు వసూలు చేస్తాయి.
ఐఈఎక్స్‌లో విద్యుత్ విక్రయాలు సాగేది ఇలా..ఐఈఎక్స్‌లో గత నెలలో మొత్తం 8,267 మిలియన్ యూనిట్ల కరెంటును విక్రయించారు. సగటున యూనిట్ విక్రయ ధర రూ.6.49 నమోదైంది. వాస్తవానికి ఎక్స్ఛేంజీలో ప్రతీ 15 నిమిషాల సమయానికి ఒక స్లాట్ చొప్పున ధరను కోట్ చేసి కొంటారు. ప్రతీరోజూ ప్రజల కరెంటు వినియోగం గరిష్ఠంగా ఉండే సమయంలో యూనిట్ ధర రూ.12కి విక్రయిస్తారు. వినియోగం తక్కువగా ఉన్న సమయంలో యూనిట్ ధర రూపాయి నుంచి రూ.2కి సైతం పడిపోతుంది. ఉదాహరణకు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.15 గంటల వరకూ 15 నిమిషాల స్లాట్‌లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సహా దక్షిణాది రాష్ట్రాలు ఐఈఎక్స్‌లో యూనిట్ కొనుగోలు ధర రూ.3.37 ఉండగా మంగళవారం సాయంత్రం 6.45 నుంచి రాత్రి 11 గంటల వరకూ యూనిట్‌కు గరిష్ఠంగా రూ.12 చొప్పున చెల్లించి కొన్నట్లు ఎక్స్ఛేంజీ ప్రకటించింది. ఇలా ప్రతీ 15 నిమిషాల స్లాట్‌కు దేశవ్యాప్తంగా ఉండే విద్యుత్ డిమాండును బట్టి కొనుగోలు ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి.