పట్టభద్రులు ఓటు నమోదుకు కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సమయాన్ని వృథా చేయకుండా ప్రతి కాలనీ, బస్తీ, అపార్ట్మెంట్లలో పర్యటించి గ్రాడ్యుయేట్లను గుర్తించాలన్నారు. ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మంత్రి అధ్యక్షతన సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో సనత్నగర్ నియోజకవర్గ తెరాస పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది.
కేంద్రానికి బాధ్యత లేదా?:
"భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందని వారు ఆందోళన చెందొద్దు. మిగిలిన వారికీ అందిస్తాం. కష్టాల్లో ఉన్న ప్రజలకు చేయూతను అందించేందుకు సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయలను అందజేశారు. ప్రకృతి వైపరిత్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సాయం అందించలేదు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు 1000 కోట్లు, వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు 500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి".
-తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ మంత్రి
దిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తీసుకురాలేని భాజపా ఎంపీలు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాము అంతకంటే ఎక్కువగా మాట్లాడగలమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వ చర్యలు దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. తెరాసలో నాయకులు, కార్యకర్తలకు ఎంతో గౌరవం ఉందని, కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇస్తుందని అన్నారు.
ఓటర్ల నమోదులోనూ ముందుండాలి:
అభివృద్ధిలో ఎంతో ముందున్న సనత్నగర్ నియోజకవర్గాన్ని గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కూడా అంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, సనత్ నగర్ నియోజకవర్గ జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంఛార్జి నారదాసు లక్ష్మణరావు అన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంతో ప్రజలలోకి వెళ్లేందుకు కార్పొరేటర్లు, నాయకులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. గతంలో గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి సంవత్సరంన్నర అవుతున్నా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆరోపించారు. సమావేశంలో కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, తెరాస సీనియర్ నాయకులు, పీఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: మంత్రి తలసాని ఇదీ చూడండి: మత్స్యకారుల కోసం అనేక కార్యక్రమాలు: తలసాని