'ఆ కార్యక్రమంలో పాల్గొనే నైతిక అర్హత ప్రధాని మోదీకి లేదు..' Talasani Comments: రామానుజ విగ్రహావిష్కరణకు వచ్చే అర్హత ప్రధాని మోదీకి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధార్మిక కార్యక్రమానికి వచ్చిన ప్రధాని.. యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. సందర్భమే లేని సమయంలో విభజన అంశంపై మాట్లాడటం మోదీ అవలంభిస్తోన్న రాజకీయ డ్రామా అని అభివర్ణించారు.
ఇదంతా మోదీ రాజకీయ డ్రామా..
"వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు సమాతాసూత్రం బోధించారు. విభజించి పాలించే భాజపా... సమానత్వం గురించి మాట్లాడుతోంది. మతాన్ని, కులాన్ని, వర్గాలను అడ్డుపెట్టుకుని ప్రజలను విభజించి అధికారం కోసం పాకులాడే భాజపా ఇప్పుడు సమానత్వం అనటం హాస్యాస్పదం. ధార్మిక కార్యక్రమానికి వచ్చి.. కేవలం దాని గురించి మాట్లాడకుండా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటమేంటీ..? అసలు ఆయనకు ఈ కార్యక్రమానికి వచ్చే నైతిక అర్హత లేదు. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడాల్సింది పోయి.. ఇప్పుడు విభజన మీద ఎందుకు మాట్లాడుతున్నారు. ఏ పార్లమెంటు సభ్యుడు లేవనెత్తని ప్రశ్నపై అనవసర సమాధానం ఎందుకు చెప్తున్నారు..? ఇదంతా ఓ రాజకీయ డ్రామా. ఎన్నికల కోసం వేస్తున్న కొత్త ఎత్తు. గతంలో కరెంట్, నీళ్లు లేక ఇంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసు. ఇవాళ సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే స్థాయికి రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇదంతా ప్రధానికి కనబడట్లేదు. ఈ డ్రామాల రాజకీయాలతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు." - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
ఇదీ చూడండి: