Prashanth Reddy on Dharani Portal : భూమిని రైతు ప్రాణంలా చూసుకుంటాడని... దానిపై తనకు హక్కులు లేవని రికార్డుల్లో కరెక్ట్ లేకుంటే నిద్ర పట్టదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితి రావొద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్... భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. 2.48 కోట్ల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను వెరిఫై చేసినట్లు వెల్లడించారు. భూ క్రయవిక్రయాల్లో రైతులు ఇబ్బంది పడొద్దని ధరణిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ధరణిలో ప్రస్తుతం కోటి 52 లక్షల ఎకరాల భూ వివరాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ఇది సాహసోపేతమైన చర్య
ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం 66 లక్షల రైతుల వివరాలు పక్కాగా ఉన్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ధరణి పోర్టల్ ప్రకారమే రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామన్నారు. ధరణి రూపకల్పన సాహసోపేతమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు ఏళ్ల తరబడి తిరగవద్దనే ధరణి తెచ్చినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశిత ధరల ప్రకారమే రుసుము చెల్లిస్తారని వివరించారు.