తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాసకు ఇబ్బంది లేకుండా.. ఎంఐఎం వ్యూహాత్మక పోటీ

గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గెలుస్తామని ధీమా ఉన్న స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల అభ్యర్దులను బరిలోకి దించకూడదని భావిస్తోంది. మిత్ర పక్షం తెరాసకు ఇబ్బంది కలగకుండా పావులు కదుపుతోంది. ఓట్లు చీలిపోతే ప్రతిపక్షాలు లాభపడే అవకాశం ఉందని భావించి... జాబితా విడుదల చేయకుండానే అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించింది. సిట్టింగ్‌ స్థానాలను కోల్పోకుండా జాగ్రత్తలు చేపట్టింది.

mim strategic contest in ghmc elections without problem for trs
తెరాసకు ఇబ్బంది లేకుండా.. ఎంఐఎం వ్యూహాత్మక పోటీ

By

Published : Nov 21, 2020, 6:35 AM IST

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పట్టుకోల్పోకుండా ఉండేందుకు ఎంఐఎం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఖరారులో ఆపార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. అభ్యర్దులను గెలిపించే బాధ్యతను సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అప్పగించింది. పలు సిట్టింగ్‌లను మార్చినప్పటికీ ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఎమ్మెల్యేలతో బుజ్జగించి... నామపత్రాలు దాఖలు చేయించింది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాలను దక్కించుకున్న ఎంఐఎం... ఈసారి ఆ స్థానాల్లోనే పోటీచేస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షమైన తెరాసతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా మిగతా ప్రాంతాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించడం లేదు. ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీనిస్తుందన్న అంచనాతో భాజపాకు అధిక సీట్లు రాకుండా తెరాస వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు మేయర్‌ ఎన్నికలో కీలకంగా మారాలని మజ్లిస్‌ పట్టుదలతో ఉంది. అంతర్గతంగా గులాబీ పార్టీకి మద్దతు పలుకుతున్నప్పటికీ సొంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకుండా ప్రయత్నాలు చేస్తోంది.

చాలా చోట్ల నామినేషన్ల దాఖలుకు ఎమ్మెల్యేలు హాజరు కావడం అధికారికంగా అభ్యర్థిత్వం ఖరారైట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పలు డివిజన్ల అభ్యర్ధుల నామినేషన్‌కు హాజరైన ఎమ్మెల్యే మోజాంఖాన్‌... గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ అందుకున్న అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. నిరంతరం అందుబాటులో ఉండే అభ్యర్ధిని ఎన్నుకోవాలంటూ ఇంటింటా విస్తృత ప్రచారం చేస్తున్నారు. పాతబస్తీ పరిధిలోని డివిజన్లలో అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే తప్ప స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదీ చూడండి:బల్దియా పోరు: కసరత్తు ముగిసింది.. ప్రచారమే మిగిలింది..

ABOUT THE AUTHOR

...view details