తెలంగాణ

telangana

ETV Bharat / city

పెచ్చుమీరుతున్న అధికారుల ఆగడాలు.. పన్ను​ కట్టలేదని రెండిళ్లకు తాళాలు.!

Property and garbage Tax: చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరిట అధికారుల అరాచకాలు పెచ్చుమీరాయి. పన్నుల వసూలు పేరిట జనం పట్ల అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల చెత్త పన్ను కట్టలేదంటూ ఏపీలోని కర్నూలు జిల్లాలో దుకాణాల ముందు చెత్త వేయగా.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ కాకినాడలో ప్రచారం చేయడం విస్తుగొలిపింది. వీటన్నింటికీ పరాకాష్టగా పిఠాపురంలో ఆస్తి పన్ను బాకీ ఉన్నారంటూ రెండిళ్లకు ఏకంగా తాళాలు వేశారు.

Property and garbage Tax in kurnool
చెత్త పన్ను

By

Published : Mar 21, 2022, 11:24 AM IST

Property and garbage Tax in kurnool: చెత్త పన్ను కోసం ఏపీలోని కర్నూలు నగరపాలక అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. వెంకటరమణ కాలనీలోని ఓ అపార్టుమెంట్‌ వాసులు చెత్త పన్ను కట్టలేదని.. కుళాయి కనెక్షన్ తొలగించారు. ఈ నెల 16వ తేదీన నెహ్రూ రోడ్డులో అనంత షాపింగ్ కాంప్లెక్స్ వద్ద.. ట్రక్‌ నిండా చెత్తను కుమ్మరించారు. ఈ చర్యను కాంప్లెక్సులోని దుకాణదారులు తీవ్రంగా నిరసించారు. కరోనా దెబ్బకు విలవిల్లాడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమను.. చెత్త పన్ను పేరిట వేధిస్తున్నారని వాపోయారు. దుకాణాల ముందు చెత్త వేయడం పట్ల మండిపడ్డారు.

కుళాయి గొట్టాలకు బిరడాలు..

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో.. కుళాయి కనెక్షన్లకు డిపాజిట్లు కట్టలేదని.. కుళాయి గొట్టాలకు బిరడాలు బిగిస్తున్నారు. కుళాయిల ఏర్పాటుకు గతంలో 3 వేల రూపాయలు చెల్లించామని.. ఇప్పడు అనధికార కనెక్షన్ల పేరుతో తొలగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వానికి 20 లక్షల రూపాయలు బాకాయిలు ఉన్నాయని.. నగర పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.6,400 చెల్లిస్తేనే పునరుద్ధరిస్తామంటున్న అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు..

ఆస్తి పన్నుల విషయంలోనూ మున్సిపల్‌ అధికారుల తీరు దారుణంగా ఉంటోంది. ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామంటూ.. ఇటీవల వాహనాలకు బ్యానర్లు కట్టిమరీ కాకినాడలో ప్రచారం చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో... మున్సిపల్‌ కమిషనర్‌ వివరణ కూడా ఇచ్చారు. ఆస్తి పన్నుపై ప్రజలకు అవగాహన కల్పించడానికే వాహనాలకు బ్యానర్లు కట్టినట్లు చెప్పుకొచ్చారు.

రెండిళ్లకు తాళాలు..

వీటన్నింటికీ పరాకాష్టగా.. కుళాయి పన్ను, చెత్త పన్ను కట్టలేదంటూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రెండిళ్లకు అధికారులు తాళాలు వేశారు. మోహన్ నగర్‌లోని సత్తిబాబు, రమణ ఇళ్లకు సీల్‌ వేయడం సంచలనం సృష్టిస్తోంది. చట్టబద్ధంగా పన్నులు వసూలుకు ప్రయత్నించకుండా... ఆగమేఘాల మీద ఇళ్లకు తాళాలు వేయడం ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. సీజ్‌ చేసిన రెండు ఇళ్లను ఏపీ తెదేపా మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందిస్తూ చట్టబద్ధంగా పన్నులు వసూలు చేయాల్సిన అధికారులు... పరిధి దాటి వ్యవహరించడం దారుణమని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి:Father raped Daughters : కన్నతండ్రే కాటేస్తే.. చావే శరణమనుకున్నారు కానీ..

ABOUT THE AUTHOR

...view details