తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండు రాష్ట్రాలకు అనుసంధాన దారి.. అభివృద్ధికి వారధి

రెండు తెలుగు రాష్ట్రాలకు ఏపీలోని గుంటూరు జిల్లా వెల్దుర్తి ప్రాంతంలోని జాతీయ రహదారి-565 ఎంతో కీలకమైనది. అటవీ ప్రాంతం గుండా ఈ రోడ్డు ద్వారా... పరిశ్రమల సరుకులు, నిత్యవసరసరుకులు ఎక్కువగా వెళ్తాయి. అన్నింటీకి అనువుగా ఉండే ఈ రహదారి విస్తరణకు ప్రతిపాదనలున్నా... ఏడేళ్లుగా విస్తరణ పనులు జరగట్లేదు. తాజాగా ప్రభుత్వం రూ. 300కోట్లతో ప్రతిపాదనలు పంపించగా..కేంద్రం అనుమతులు రానున్నాయి. ఈ రహదారి నిర్మాణంతో సరకు రవాణాకు మార్గం సుగమం కానుంది.

రెండు రాష్ట్రాలకు అనుసంధాన దారి.. అభివృద్ధికి వారధి
రెండు రాష్ట్రాలకు అనుసంధాన దారి.. అభివృద్ధికి వారధి

By

Published : Dec 3, 2020, 5:09 PM IST

వెల్దుర్తి ప్రాంతంలో అధ్వానంగా జాతీయ రహదారి

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేయడంలో ఏపీలోని గుంటూరు జిల్లా వెల్దుర్తి ప్రాంతంలోని 565 నంబరు జాతీయ రహదారి ఎంతో కీలకమైంది. మాచర్ల ప్రాంతంలోని సిమెంట్‌ కర్మాగారాలు, తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన పరిశ్రమల నుంచి ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడుకు సిమెంట్‌ సరఫరా చేయడానికి ఈ మార్గం తోడ్పడుతుంది. పల్నాడు ప్రాంతం నుంచి చెన్నై పోర్టుకు సరకు రవాణాకు ఈ మార్గం ఎంతో కీలకం. ఇక్కడ పండే వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు గ్రానైట్‌, పలకరాయి, నాపరాయి ఎక్కువగా చెన్నై పోర్టుకు తరలిస్తున్నారు. ఈ మార్గం విస్తరించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళుతుండటంతో దూరం పెరగడం వల్ల ఇంధనం, సమయం వృథా అవుతున్నాయి. రహదారి పనులు పూర్తయితే సరకు రవాణాలో ఈరోడ్డు ఎంతో కీలకంగా కానుంది.

గుంటూరు జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కీలకమైన రహదారి ఇది. పర్యటకులు నాగార్జునసాగర్‌ పరిసర ప్రాంతాలు చూసుకుని నల్లమల అటవీప్రాంతం గుండా ఈమార్గంలో శ్రీశైలం వెళుతున్నారు. తెలంగాణ నుంచి తిరుపతికి నేరుగా వెళ్లడానికి కూడా ఈ మార్గాన్ని వాడుకుంటున్నారు. బహుళ ప్రయోజనాలు ఉండటంతో రహదారి ప్రాధాన్యం దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలోనే 2012లో విస్తరణ ప్రకటించిన కేంద్రం 2013లో పనులు చేపట్టింది. ఈ మార్గాన్ని రెండు వరుసల రహదారిగా విస్తరించే పనులను జాతీయ రహదారుల సంస్థ చేపట్టింది. 2017 నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అటవీ, మైనింగ్‌ అనుమతులు రావడంలో జాప్యం, సాంకేతిక కారణాలతో గుత్తేదారు ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆపేశారు. దీంతో అప్పటినుంచి రహదారి విస్తరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

రహదారి సాగేది ఇలా..

జాతీయ రహదారి 565 తెలంగాణలోని జాతీయ రహదారి-65 నుంచి నకిరేకల్‌ వద్ద మొదలై నల్గొండ, మాచర్ల, కనిగిరి, వెంకటగిరి మీదుగా వెళుతూ... జాతీయ రహదారి-71లోకి చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ముగుస్తుంది. ఈ రహదారి ఆంధ్రప్రదేశ్‌లో 420 కిలోమీటర్లు, తెలంగాణ రాష్ట్రంలో 86 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలో 86వ కిలోమీటరు వద్ద మొదలై 134వ కిలోమీటరు వరకు ప్రయాణించి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రకాశం జిల్లాలో కొంత కలిపి మొత్తం 55 కిలోమీటర్ల మార్గాన్ని విస్తరించడానికి రూ.300 కోట్లతో కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపారు. గతంలోనే నిధులు మంజూరై పనులు మొదలైనా గుత్తేదారు అర్ధంతరంగా పనులు నిలిపేయడంతో అతనిని తొలగించి కొత్తగా ప్రతిపాదనలు తయారుచేసి పంపారు. రహదారి విస్తరణ పూర్తయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాకపోకలకు సరిహద్దులో కీలక రహదారి కానుంది.

ఏటా 130 నుంచి 140 ప్రమాదాలు

సాగర్‌ నుంచి ప్రకాశం జిల్లా సరిహద్దు వరకు గుంటూరు జిల్లా పరిధిలో జాతీయ రహదారి 565 అత్యంత అధ్వానంగా ఉంది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడిన రహదారిలో ప్రయాణ సమయం పెరగడంతోపాటు వాహనాలు దెబ్బతింటున్నాయి. జిల్లా పరిధిలోని రహదారిలో ప్రమాదకర మలుపులు, రహదారి పక్కన లోయలను తలపించే రీతిలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. రాత్రివేళ రహదారికి ఇరువైపులా కనిపించేలా రేడియం స్టిక్కర్లు అంటించారు. మలుపులో అక్కడక్కడ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. రహదారి విస్తరణ జరగకపోవడంతో వీటిని వాహనాలు ఢీకొట్టడంతో రూపుకోల్పోయాయి. ఇరుకుగా ఉన్న రహదారిపై రాకపోకలు ప్రాణసంకటంగా మారాయి. రాత్రివేళ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా ఈమార్గంలో 130 నుంచి 140 ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలో రహదారి నిర్మాణానికి అటవీ అనుమతులు వచ్చాయని జాతీయ రహదారులశాఖ అధికారి అన్నారు. రహదారిని రెండు వరుసలుగా విస్తరించడంతోపాటు ఇరువైపులా బెర్మ్‌తో 10మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి రూ.300 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.

ఇదీ చూడండి:ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుపై సర్కారుకు హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details