తెలంగాణ

telangana

ETV Bharat / city

భూముల చుట్టూ.. సమస్యల ముళ్లు - Implications of land registration in Telangana

ఏళ్లతరబడి వారే సాగు చేసుకుంటున్నారు. వారి వద్ద పాత దస్త్రాలున్నాయి. నేటికీ కొత్త పాసుపుస్తకం అందలేదు... తాము సాగు చేసుకుంటున్న భూమికి ఆధీన ధ్రువీకరణ పత్రం ఉంది. అయినా ఆన్‌లైన్‌లో సర్వే నంబరు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అనేక భూ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

implications in land registrations in telangana due to issues in dharani portal
భూముల చుట్టూ.. సమస్యల ముళ్లు

By

Published : Feb 3, 2021, 6:40 AM IST

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రవేశ పెట్టి సులభతర భూ లావాదేవీలకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టంతో ఇన్నాళ్లూ హక్కులు, పాసుపుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లకు అధికారాలు లేకుండా పోయాయి. ఇటీవల పెండింగ్‌ సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. నెలల తరబడి పరిష్కారం కాని సమస్యలకు వారం రోజులే గడువు విధించింది. దీనివల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఐచ్ఛికాలే లేవంటూ నిట్టూరుస్తున్నారు.

* కుటుంబంలోని కొందరిని తప్పించి మిగిలినవారికి గతంలో పాసుపుస్తకాలిచ్చారు. దీన్ని సరిచేసే ఐచ్ఛికాన్ని ధరణిలో ఇవ్వలేదు. ఇన్నాళ్లూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు రెవెన్యూ కోర్టుల్లో కేసులున్న వారివి మాత్రమే పరిష్కరిస్తామంటున్నారు. క్షేత్ర స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు అర్హులైన వారికి శాపంగా మారాయి.

* భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలినదానిని లబ్ధిదారుల ఖాతాలో కలపాల్సిఉండగా ఇంకా పరిష్కరించలేదు. ఒక సర్వే నంబరులో సగం భూమి తీసుకుంటే ఆ నంబరు మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఐచ్ఛికాన్ని ఇచ్చింది. అయితే, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో దరఖాస్తును ఆన్‌లైన్‌ తిరస్కరిస్తోంది.

* గతంలో సాదాబైనామాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అనువుగా మలుచుకుని పక్కనే ఉన్న సర్వే నంబరులోని భూమిని కూడా కొందరు కలిపేసుకున్నారు. ఈ అంశంపై విచారించిన అనంతరమే క్రమబద్ధీకరించాల్సి ఉండగా చాలా చోట్ల దస్త్రాల ఆధారంగా మమ అనిపించారు. ఇప్పుడు ఈ తప్పును సరిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఏజెన్సీ ప్రాంతంలో పాసుపుస్తకాల జారీ సమస్య

* గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ చట్టానికి లోబడి అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనుల నుంచి గిరిజనేతరులు, అర్హత లేని గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 76 వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గిరిజనులు, గిరిజనులకు మధ్య తెల్లకాగితాలపై జరిగిన ఒప్పందాలు సాదాబైనామాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది.

* కొందరు రైతుల మధ్య విస్తీర్ణంలో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసుకోగా ఇరువురికి పాసుపుస్తకాలు నిలిపివేశారు. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ పరిష్కారం కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు.

* పాసుపుస్తకంతో ఆధార్‌ అనుసంధానం సందర్భంగా వేలిముద్రలు నమోదుకాక ఇన్నాళ్లూ పాసుపుస్తకం రానివాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ లాగిన్‌లో మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు లేకపోతే కనుపాప ఐరిస్‌తోనూ పాసుపుస్తకం జారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

* ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారికి చాలా చోట్ల పాసుపుస్తకాలు జారీ చేయడం లేదు.ఈ తరహా భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

* ఆన్‌లైన్‌లో ఖాతా నంబరు లేక పాసుపుస్తకాలు రాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లూ వీరికి పాసుపుస్తకం జారీ చేస్తామంటూ తహసీల్దారు కార్యాలయ అధికారులు సర్ధిచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్లకు పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. అయితే ఖాతా నంబరు లేని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం మీసేవ, ధరణిలో ఐచ్ఛికాలు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూముల విస్తీర్ణంలో కోత

కొందరు రైతులకు పాసుపుస్తకాల్లో సర్వే సంఖ్యలు నమోదైనప్పటికీ విస్తీర్ణాల్లో కోతలు పెట్టారు. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఒక గ్రామ సేత్వారిలోని మొత్తం విస్తీర్ణం ఆ గ్రామంలోని రైతుల ఖాతాల్లోని విస్తీర్ణానికి మించి ఉంటే ధరణిలోకి అనుమతించదు. ఈ కారణంతోనే మొదట్లో రెవెన్యూ సిబ్బంది కొందరు రైతుల విస్తీర్ణాల్లో కోతపెట్టారు. ఇప్పటికీ ఈ కత్తిరించిన విస్తీర్ణాలను కలిపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కలెక్టర్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌.. మ్యుటేషన్‌

ధరణి పోర్టల్‌లో నెల రోజుల వ్యవధిలో 60 వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. పోర్టల్‌ గతేడాది నవంబరు రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లే అధికం. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనిష్ఠంగా మూడు నిమిషాలు, సగటున 36 నిమిషాల సమయం పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడికి రెండు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధి పడుతోంది. ఎన్ని రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయో అంతే సంఖ్యలో మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details