తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​ కాలుష్యంపై అధ్యయనం... మూలాల ఆధారంగా నివారణ చర్యలు - iit kanpur news

రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి మూలాల్లోనే చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. కాలుష్య కారకాలేంటీ... నివారణ చర్యలేంటీ... తదితర అంశాలపై ఓ ప్రముఖ సంస్థతో అధ్యయనం చేయించబోతోంది. ఇందు కోసం ఐఐటీ కాన్పుర్​ ఎంపిక కాగా... ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిసింది.

iit kanpur study on air pollution in hyderabad
iit kanpur study on air pollution in hyderabad

By

Published : Dec 9, 2020, 7:27 AM IST

హైదరాబాద్​లో గాలి నాణ్యత పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని మూలాల్లోనే నివారించేందుకు శాస్త్రీయ పంథాలో చర్యలు చేపట్టబోతోంది. ఏ రకమైన కాలుష్యం ఎక్కడి నుంచి.. ఎంత పరిణామంలో వస్తుందో తెలుసుకునేందుకు 14 ఏళ్ల తర్వాత ఓ ప్రముఖ సంస్థతో రూ.కోటి వ్యయంతో అధ్యయనం చేయించబోతోంది. హైదరాబాద్‌లో కాలుష్యంపై చివరిసారి 2006లో అధ్యయనం జరిగింది. అప్పటి గణాంకాల ఆధారంగానే ఇప్పటికీ కాలుష్య నియంత్రణ కార్యాచరణ అమలవుతోంది. ఇన్నేళ్లలో నగరంలో కాలుష్య తీవ్రతలో చాలా మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌, పటాన్‌చెరులో కాలుష్య తీవ్రత, మూలాలపై అధ్యయనానికి నిర్ణయించింది.

ఐఐటీ కాన్పుర్‌, ఐఐటీ బొంబాయి, ఐఐటీ దిల్లీ, ‘నీరి’ నాగ్‌పూర్‌, టాటా ఎనర్జీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు ఇందుకు ముందుకు రాగా.. అర్హతల ఆధారంగా ఐఐటీ కాన్పుర్‌ ఎంపికైనట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిసింది. ఏ కారణంగా ఎంత వాయు కాలుష్యం వస్తుందన్నది ఈ అధ్యయనంలో తెలుసుకోనున్నట్లు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వాహనాల నుంచి, పరిశ్రమల నుంచి ఎన్ని టన్నుల కాలుష్యం వస్తోంది? నగరం ఎంత కాలుష్యాన్ని తట్టుకునే సామర్థ్యంతో ఉంది? వంటి అంశాలను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో కొత్త వాహనాలకు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వవచ్చా? లేదా? వంటి సూచనలను కూడా అధ్యయన సంస్థ ఇవ్వనుంది. మార్చి-ఏప్రిల్‌ కల్లా తొలి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

ప్రధాన కాలుష్య కారకం.. పీఎం 10

సూక్ష్మధూళి కణాలు (పీఎం 10).. అంటే 2.5 నుంచి 10 మైక్రోమీటర్ల మందంతో ఉండే సూక్ష్మధూళి కణాలు పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇంకా అతిసూక్ష్మధూళి కణాలు (పీఎం 2.5), నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, ఓజోన్‌ వంటి కాలుష్య కారకాలు గాలిని కలుషితం చేస్తాయి. గడిచిన కొన్నేళ్లుగా పీఎం 10 ఉద్గారాల తీవ్రత పెరుగుతోంది. ఈ ఉద్గారాలు క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే పర్వాలేదు. అంతకుమించితే ఇబ్బందే. హైదరాబాద్‌లో క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 2015లో గరిష్ఠంగా 132, 2016లో 134, 2017లో 147, 2018లో 137, 2019లో 137 మైక్రోగ్రాముల పీఎం 10 ఉద్గారాలు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:నేడు భారత్​ బయోటెక్​కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు

ABOUT THE AUTHOR

...view details