Electricity Usage Gone All time High in Entire Telangana History: తెలంగాణలో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకీ పెరుగుతున్న ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రజలు విపరీతంగా కరెంటును ఉపయోగిస్తున్నారు. ఫలితంగా మార్చి రాకముందే డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీనికి ఉదాహరణ మంగళవారం వినియోగించిన కరెంటు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14,794 మెగావాట్ల విద్యుత్తు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని ఆ శాఖ వెల్లడించింది.
ప్రతి సంవత్సరం వేసవి వస్తోందంటే విద్యుత్తు డిమాండ్ పెరగడం సహజం. ఏటా ఇలా జరుగుతున్నప్పటికీ.. ఈ ఏడాది అది మరింత పెరిగింది. ఈసారి విద్యుత్తు వినియోగం మరో మెట్టు ఎక్కి మంగళవారం నాటికి జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఒకప్పుడు వేసవి అంటే మార్చిలో ప్రారంభమై.. జూన్లో ముగిసేది. మరిప్పుడో.. ఫిబ్రవరిలోనే వచ్చేస్తుంది. ఇలా శివరాత్రి అయిపోయిందో లేదో కానీ.. అలా ఎండలు దంచికొడుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఫిబ్రవరి మధ్యలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటితే చాలు... వేడి దెబ్బకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు కూడా రావట్లేదు.
ఈసారి ఫిబ్రవరి పూర్తి కాక ముందే వేసవి వచ్చేసింది. ఎండలు తీవ్రతరమవుతున్నాయి. వేడిని తట్టుకోలేక ప్రజలు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. 24 గంటలూ అవి పనిచేయాల్సిందే. ఫలితంగా విద్యుత్ వినియోగమూ విపరీతంగా పెరిగిపోయింది.