Ts Budget Discussion: అభివృద్ధి జరుగుతుందో.. లేదో మధిరకు వెళ్లి చూద్దామా..? : హరీశ్‌రావు Ts Budget Discussion: బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌గా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. పాతబస్తీకి మెట్రోను స్వాగతించిన అక్బరుద్దీన్.. హమీలే తప్ప ఆచరణే లేదన్నారు. ప్రకటనలే తప్ప ఎలాంటి పనులు చేయడం లేదంటూ నిలదీశారు. శాసనసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలో రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
నేను మీ శత్రువు కాదు..
నేను కొత్త విషయమేమీ చెప్పడంలేదు. హృదయం రగిలిపోతోంది. కష్టంగా ఉంది. మేం మీ మిత్రులం. మీకు సహకరిస్తున్నాం. కానీ ఇవాళేం జరుగుతోంది? మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చచ్చిపోయింది. మంచిని ప్రశంసిస్తాం. ఏదైతే జరగడంలేదో దాన్ని ప్రశ్నిస్తాం. ఎందుకంటే ప్రశ్నించమని ప్రజలు నన్ను పంపించారు. నేను మీ శత్రువు కాదు. మీ మిత్రుడిని. ఎవరైనా సభ్యుడు తన స్థానం నుంచి వెల్‌లోకి వస్తే అతడిని సస్పెండ్ చేస్తున్నారు. సభలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఏం చేయాలో మీరు నిర్ణయం తీసుకోవాలి. హామీలు అమలు చేయకపోతే అసలు ఇవ్వకండి. దయచేసి సభలో ప్రకటించండి. సభ మర్యాద కోసం నేను చెబుతున్నాను. సభలో ఇచ్చిన హమీలు నెరవేర్చకపోతే... అసెంబ్లీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లే.
- అక్బరుద్దీన్ ఒవైసీ, ప్రతిపక్ష నేత
మోదీ సర్కారు కక్ష కట్టింది..
అనంతరం బడ్జెట్‌పై చర్చలో తెరాస తరఫున మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్.. తెలంగాణపై మోదీ సర్కారు కక్ష కట్టిందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేందుకు భాజపా యత్నిస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం తెరాస సర్కారు అహర్నిశలు కృషిచేస్తోందని వివరించారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని బాల్క సుమన్ గుర్తుచేశారు.
హామీలను తుంగలో తొక్కారు..
కాంగ్రెస్ తరఫున మాట్లాడిన భట్టి విక్రమార్క... ప్రజల ఆకాంక్షలు తీర్చేలా బడ్జెట్ లేదని విమర్శించారు. ఇష్టారీతిన అప్పులు చేసుకుంటూ వెళ్తున్నారన్న భట్టి.. లక్షల కోట్లు అప్పులు చేయడం రాష్ట్రానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్న సీఎల్పీ నేత పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
తూట్లు పొడుస్తోంది..
బడ్జెట్‌పై సమాధానం ఇచ్చిన ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు... భాజపా, కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 80 వేల ఉద్యోగాలు ఒకేసారి ప్రకటించిన సందర్భం దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేదన్న హరీశ్... ప్రభుత్వ ప్రకటనతో కాంగ్రెస్, భాజపా నేతలు బేజారవుతున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయో... లేదో... మధిరకు వెళ్లి చూద్దామా అంటూ భట్టికి సవాల్ విసిరారు. సమాఖ్య విధానానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. అనంతరం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ ముగిసిందని సభాపతి ప్రకటించారు.
ఇదీచూడండి:Harish Rao About Budget 2022-23 : 'కొత్తగా ఏర్పడినా.. తెలంగాణ దేశానికే ఆదర్శం'