తెలంగాణ

telangana

ETV Bharat / city

Gutha Sukender Reddy : 'పాలనకు శాసనసభ, మండలి రెండు కళ్లు'

Gutha Sukender Reddy : ‘‘ప్రజాస్వామ్యానికి, పాలనకు శాసనసభ, మండలి రెండు కళ్ల లాంటివి. పార్లమెంటులో లోక్‌సభ కంటే రాజ్యసభకు ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలో శాసనసభ మాదిరిగానే మండలికి ప్రాధాన్యం ఉంది. రెండింటికీ దాదాపుగా ఒకేరకమైన అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. ఈ విషయాన్ని అందరికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం.’’ అని మండలి కొత్త ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

By

Published : Mar 15, 2022, 7:23 AM IST

Gutta Sukender Reddy
Gutta Sukender Reddy

Gutha Sukender Reddy : ‘‘శాసనసభ, మండలి.. ప్రభుత్వపరంగా రెండింటినీ ఒకే దృష్టితో చూస్తున్నా.. రాష్ట్రంలో సంప్రదాయకంగా, ప్రసార మాధ్యమాల పరంగా మండలిని రెండోస్థానంలో చూస్తున్నారు. అలా కాకుండా సమానంగా చూడాలని కోరుతున్నాను’’ అని మండలి కొత్త ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనమండలికి రెండోసారి ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టమని, తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. మండలిని మరింత క్రియాశీలకంగా, దేశానికి ఆదర్శంగా నిలుపుతానని, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కృషి చేస్తామని, సభ్యులకు అన్ని విధాలా సహకరించడంతో పాటు తనకు ఇష్టమైన ప్రజాసేవను కొనసాగిస్తామని తెలిపారు.రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Legislative Council ChairmanGutha Sukender Reddy :

  • వరుసగా రెండోసారి రాజ్యాంగబద్ధమైన పదవి దక్కడం గొప్పవిషయం. తెలంగాణ మండలిలో ఈ ఘనత పొందిన మొదటి వ్యక్తిని నేనే కావడం గర్వంగా ఉంది. మొదటి సారి మండలి ఛైర్మన్‌గా ఎంపిక చేసినప్పుడు దీనినో బృహత్తర బాధ్యతగా స్వీకరించాను.ఆ తర్వాత పదవీ విరమణ పొందినా కేసీఆర్‌ మరోసారి పిలిచి అవకాశం ఇచ్చారు. నా సేవలకు గుర్తింపుగా దీనిని భావిస్తున్నాను.
  • స్థానిక సంస్థలు, డెయిరీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో, పార్లమెంటులో పనిచేసిన అనుభవం నాకుంది. మూడుసార్లు ఎంపీగా పని చేసి పార్లమెంటు పనితీరును సమగ్రంగా అధ్యయనం చేశాను. తొలిసారి మండలి ఛైర్మన్‌ పదవిని చేపట్టినప్పుడు ఆ అనుభవం ఎంతో ఉపయోగపడింది. రెండోసారీ అలాగే పనిచేస్తాను.
  • శాసనమండలి అంటే పెద్దల సభ. రాజకీయాల్లో విశేషానుభవం గల వారు సభ్యులుగా ఉన్నారు. అన్ని పార్టీల వారు చక్కటి ప్రశ్నలు వేసి, సభను సజావుగా నడిచేందుకు సహకరిస్తున్నారు. ఏ రోజూ గొడవలు, ఇతర అవాంఛనీయ పరిణామాలు లేవు. రెండో దఫా ఛైర్మన్‌ పదవి కోసం అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు నా పేరును ప్రతిపాదించడం సభలో చక్కటి వాతావరణాన్ని తెలియయజేస్తోంది. ఛైర్మన్‌గా అధికార, విపక్షాలను సమానంగా చూస్తాను.
  • సభలో ప్రతి నిమిషం ఎంతో విలువైంది. సభ్యులకే కాకుండా ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరమైంది. సమయం ఏ మాత్రం వృథా కారాదు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలన్నీ చర్చకు రావాలి. వాటికి పరిష్కారం చూపాలి. సభ్యులు ప్రతి సమస్యను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వాటిని సూటిగా ప్రస్తావించాలి. బిల్లులపై చర్చల్లోనూ చురుకుగా పాల్గొనాలి. కమిటీల్లోనూ చక్కగా పనిచేయాలి. వారు ఎలా పనిచేస్తారో ప్రజలు గమనిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details