సుమారు ఆరు కోట్ల పాత సంచులు కొనేందుకు పౌరసరఫరాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. దూరాన్ని పరిగణనలోకి తీసుకొని ఒక్కొక్కటి రూ.26-రూ.28లకు సరఫరా చేసేందుకు గుత్తేదారులు అంగీకరించారు. కరోనా కారణంగా ఒక్కో సంచికి రూ.32-రూ.35 వరకు ఇప్పిస్తామంటూ కొందరు నాయకులు రంగ ప్రవేశం చేయటంతో గుత్తేదారులు సరఫరా విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ధర పెంచాలంటూ వారు అధికారులకు వినతిపత్రం ఇచ్చినట్లు సమాచారం. అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.
కల్లాల్లోనే అమ్ముకుంటున్న రైతులు
ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పదిహేను రోజుల కిందట నుంచే ధాన్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతం మిల్లర్లు కొంటున్నారు. కొందరు కృత్రిమ ఇబ్బందులను సృష్టించి రైతుల నుంచి కల్లాల్లోనే తక్కువ ధరకు కొంటున్నారు. తొలిరోజుల్లో సన్న రకం ధాన్యానికి మంచి ధరే ఇచ్చినప్పటికీ తర్వాత నుంచి ధర తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ముందుగానే ధాన్యం రావటంతో వ్యాపారులు కొంటున్నారు.