రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మంచికి, చెడుకు మధ్య తారతమ్యాన్ని.. చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుందు. అంతేకాకుండా ఒంటరిగా అనుకున్నది సాధించలేని సమయంలో ఇతరుల సహాయం మనకు ఎంతో ఉపకరిస్తుంది. అదేంటంటే.. జీవితంలో కొన్ని లక్ష్యాలను సాధించాలంటే కేవలం అది ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు బృందంతో కలసి పనిచేయాల్సి రావచ్చు. ఒక్కోసారి ఆ బృందానికే నాయకత్వం వహించాల్సి రావచ్చు. అప్పుడు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సమర్థంగా పనిని పూర్తిచేయగలగాలి.
బృందాన్ని నడిపించాలి..
నాయకుడు కచ్చితంగా కలిగి ఉండాల్సిన లక్షణం సమర్థత. వనవాస సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు రాముడు వానరసేన సహాయం తీసుకున్నాడు. వానరులు చంచల మనస్తత్వం కలిగినవారు. అయినప్పటికీ తిరుగులేని తన నాయకత్వం ద్వారా వారందరినీ ఏకం చేసి రావణుడిపై రాముడు విజయం సాధించాడు. నాయకుడు నేర్పరి అయితే బృందంలోని సభ్యుల శక్తిసామర్థ్యాల్లో హెచ్చుతగ్గులున్నా విజయాన్ని సొంతం చేసుకోవచ్చని రాముడు రుజువు చేశాడు.
సహచరుల ప్రతిభపై విశ్వాసం..
నాయకుడు ఎల్లప్పుడూ బృందంలోని సభ్యుల ప్రతిభపై విశ్వాసం కలిగి ఉండాలి. వారి సామర్థ్యాన్ని, ఆసక్తిని గుర్తించి అందుకు అనుగుణంగా వారిని ప్రోత్సహించాలి. రామసేనలో హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు లాంటి బలవంతులతో పాటు అల్పులైన వానరసేన కూడా ఉంది. లంకను చేరడానికి సముద్రంపై వారధి కట్టాల్సి వచ్చినప్పుడు వానరులందరినీ ఏకం చేసి, వారధి నిర్మించేలా ప్రోత్సహించి కష్టమైన పనిని సుసాధ్యం చేశాడు. అందుకే బృందానికి నాయకత్వం వహించేవారికి ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో ఇదీ ఒకటి.
స్పష్టమైన లక్ష్యం..
రాముని నుంచి వ్యక్తిగతంగాను, వృత్తిపరంగానూ నేర్చుకోదగిన మరో చక్కటి అంశం స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండటం. దాన్ని ఎలా చేరుకోవాలో సరైన ప్రణాళిక రూపొందించుకోవడం. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత రాముని ఏకైక లక్ష్యం ఆమెను విడిపించడం. అందుకు అనుగుణంగానే ముందుకు కదిలాడు. వానరులతో జట్టు కట్టాడు. సమయానికి తగినట్లుగా స్పందించాడు. చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఉత్తమ నాయకునిగా ఎదగడంలో ఈ లక్షణం బాగా ఉపయోగపడుతుంది.