ప్రభుత్వ పథకాల పరిధిలోని పనులే చేపట్టాలని, వ్యక్తిగత దూరాన్ని విధిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వలస కూలీలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర రహదారులు-భవనాలశాఖ సమాయత్తమవుతోంది. పనులు చేపట్టాలంటూ రహదారులు-భవనాలు, గృహనిర్మాణ శాఖలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏయే మార్గాల్లో పనులు చేపట్టేందుకు అవకాశం ఉందో తెలుసుకునే పనిలో అధికారులున్నారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రహదారులు, వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్న అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
రెండు పడకల ఇళ్లు...
పెద్ద సంఖ్యలో రెండు పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో కూలీల క్యాంపులున్నాయి. ఇక్కడ కూలీలు అందుబాటులో ఉండటంతో ఈ ఇళ్ల పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్ల నిర్మాణాలు, జాతీయ రహదారుల పనుల్లో కూడా ఇతర రాష్ట్రాల కూలీలు అధికంగా ఉండటంతో అధికారులు వాటిపైనా దృష్టి సారించారు.