తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నదుల అనుసంధానం పథకాలు జోరందుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం గోదావరి - కావేరి అనుసంధానంపై మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది. మొదట అకినేపల్లి నుంచి మళ్లించాలని భావించారు. దీనికి సానుకూలత వ్యక్తం కాలేదు. వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి చివరకు జానంపేట నుంచి సాగర్‌కు పైప్‌లైన్ ద్వారా మళ్లించడం మేలని భావిస్తోంది.
నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు ఖర్చు
గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీల నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు వ్యయమవుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేస్తోంది. చివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట నుంచి నాగార్జునసాగర్ వరకు పైపులైన్ ద్వారా నీటిని తరలించడానికే మొగ్గు చూపింది.
ప్రాజెక్టు నివేదిక ప్రకారం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట వద్ద గోదావరిపై 67 మీటర్ల నీటిమట్టంతో బ్యారేజి నిర్మిస్తారు. అక్కడి నుంచి రోజూ 22,600 క్యూసెక్కుల నీరు పైపులైన్, సొరంగ మార్గాల ద్వారా తరలిస్తారు. ఇందుకోసం 238 కిలోమీటర్ల దూరం పైపులైన్ వేయాలి. నాలుగుచోట్ల 49.9 కిలోమీటర్ల దూరం రెండేసి సొరంగమార్గాలు, మూడుచోట్ల లిఫ్టులు ఏర్పాటు చేయాలి. మూడు లిఫ్టుల ఎత్తు 230 మీటర్లు. 45 పంపులు ఏర్పాటు చేయాలి. లిఫ్టులన్నీ భూగర్భంలోనే ఉంటాయి..కావున భూసేకరణ అవసరం లేదు. మొత్తం మార్గంలో ఆరు కిలోమీటర్లు మాత్రమే కాలువ ఉంటుంది.
ఇచ్చంపల్లి నుంచి సాగర్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదన
ఇదే నివేదికలో ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదన వివరాలను కూడా పొందుపరిచారు. దానికి రూ. 35,885 కోట్లు ఖర్చవుతాయని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ రెండోదశ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, గొట్టిముక్కల కాలువకు కలిపి 3.67 లక్షల హెక్టార్లకు నీటిని సరఫరా చేయవచ్చని నివేదించారు.
బ్యారేజి నిర్మాణం
ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత 12 కిలోమీటర్ల వద్ద 87 మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో బ్యారేజి నిర్మించి నీటిని మళ్లించవచ్చని, మధ్యలో పెద్దవాగు, లోయర్ తూముల గుట్ట, అప్పర్ తూముల గుట్ట, మూసీ రిజర్వాయర్లను వాడుకోవచ్చని, మధ్యలో వినియోగించుకున్న నీరు పోనూ 176.45 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు మళ్లించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
నీరు వృథా కాకుండా చూడటమే కీలకం
ఎత్తిపోతల ద్వారా నీటిని సుదూర ప్రాంతానికి తరలిస్తున్నందున నీరు వృథా కాకుండా చూసేందుకు రైతుల నుంచి సాగునీటిపన్ను వసూలు చేయాలని సమగ్ర ప్రాజెక్టు నివేదిక పేర్కొంది. పరిశ్రమలు, తాగు అవసరాలకు సరఫరా చేసే నీటికి కూడా ఎంతెంత వసూలు చేయాలో ప్రస్తావించింది.
నీటి తరలింపునకు మూడు ప్రత్యామ్నాయాలు
- ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు కాలువ ద్వారా తరలించడం.
- జానంపేట నుంచి సాగర్‌కు పైప్‌లైన్ ద్వారా పంపడం.
- జానంపేట నుంచి సాగర్‌కు కాలువ ద్వారా మళ్లించడం.
- ఈ మూడింటిపైనా అధ్యయనం చేసిన ఎన్‌డబ్ల్యూడీఏ జానంపేట నుంచి పైపులైన్ పథకానికే మొగ్గు చూపింది.
- నాగార్జునసాగర్ నుంచి సోమశిలకు, సోమశిల నుంచి కావేరిపై గ్రాండ్ ఆనకట్టకు నీటిని మళ్లించే మార్గాలపై ఎలాంటి మార్పు లేదు.
- ఈ పథకం వల్ల రూపాయి ఖర్చు చేస్తే రూ. 1.35 ప్రయోజనం ఉంటుందని అంచనా.