తెలంగాణ

telangana

ETV Bharat / city

తండ్రి మలిచిన శిల్పాలు.. తననే మరిచిన శిలలు

ఏ సాహసాలు చేయకపోయినా పిల్లలకు నాన్నే నిజమైన హీరో. మనల్ని ప్రపంచానికి చూపించేది అమ్మ అయితే.. ప్రపంచాన్నే మనకు చూపించేది నాన్న.  నాన్నంటే ఓ ధైర్యం.. ఓ భరోసా. మంచి బుద్ధులు చెబుతుంటే చాదస్తమనిసిస్తుంది. ఆయన స్థానానికి చేరాక ఇన్ని కష్టాలు పడ్డాడా.. ఇంత భారం మోశాడా అనిపిస్తుంది. వారు జీవితంలో సాధించలేనివి మనం సాధించేలా చేసి మురిసిపోతుంటారు. మనల్ని ప్రోత్సహిస్తూ గెలిపిస్తారు. కానీ కొందరు మాత్రం, కుమారుల నిర్లక్ష్యంతో ఓడిపోతుంటారు. ఆస్తుల కోసం పాకులాడే తనయులతో నిత్యం న్యాయం కోసం పోరాడుతున్న వారూ ఉన్నారు. వారిని ఓడనివ్వొద్దు. ఎందుకంటే వారి ఓటమి మన ఓటమే.

father's day, father's day 2021, father's day story
ఫాదర్స్ డే, ఫాదర్స్ డే 2021, ఫాదర్స్ డే స్పెషల్ స్టోరీ

By

Published : Jun 20, 2021, 1:31 PM IST

Updated : Jun 20, 2021, 2:32 PM IST

  • దంగల్​ సినిమాలో లాగా తన కుమార్తెలను రెజ్లింగ్ ఛాంపియన్స్ చేసి వారి గెలుపులో ఆనందాన్ని వెతుక్కున్నాడు ఓ తండ్రి. కూతురు ఆశయం కోసం ఆమెతో పాటు కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి తన కంటిపాపపై కొండంత ప్రేమను చాటుకున్నాడు మరో తండ్రి.
  • రెక్కలు ముక్కలు చేసుకుని కన్నబిడ్డల్ని కంటిరెప్పల్లా సాకిన అతణ్ని.. పెళ్లవ్వగానే ఒంటరివాణ్ని చేసి బయటకు గెంటేస్తే ప్రభుత్వం సాయంతో ఓ చిన్న గదిలో తలదాచుకుంటున్నాడు ఓ తండ్రి. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తిని తనకు తెలియకుండానే వారిపేర మార్చుకుని.. ఇప్పుడు కనీసం తిండికూడా పెట్టకుండా పిల్లలు వదిలేస్తే.. కోర్టుకెక్కిన మరో తండ్రి. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందడంతో తన కుమారుడికి తనకు మధ్య బంధం బలహీనపడిందని.. మానవ సంబంధాల్లో డబ్బే కీలకమవుతోందని బాధపడుతున్న ఇంకో తండ్రి.

పుట్టిన క్షణం నుంచి పిల్లలే జీవితంగా వారి కోసం అహర్నిశలు కష్టపడిన తండ్రి.. పెళ్లి కాగానే వారికి భారమవుతున్నాడు. ఆస్తుల కోసం తమను అనాథలాగా వీధుల్లోకి విసిరేస్తుంటే.. కడుపున పుట్టిన వారితో బతుకుకై పోరాటం చేస్తున్న కన్నతండ్రులు ఎందరో. ఆ పోరాటంలో తండ్రి గెలిచినా ఓడినట్టే.. పిల్లలు గెలిచినా ఓడినట్లే..

కలలను నిజం చేస్తూ..

ఇది దంగల్‌ సినిమాను తలపించే కథలాంటి నిజం. రెజ్లింగ్‌లో ఏళ్లపాటు సాధన చేసిన ‘అజ్జు’ ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే స్వస్తి పలికాడు. జీవితంలో స్థిరపడాలని అప్పటి అవసరాలు గుర్తుచేశాయి. నగరంలో చిన్న ఉద్యోగంలో చేరిపోయాడు. పెళ్లి, ఇద్దరు ఆడపిల్లలు. కూతుళ్లయితేనేం వారిలోనూ శక్తి సామర్థ్యాలుంటాయి, శిక్షణ అందిస్తే అద్భుతాలు సాధిస్తారన్న ఆలోచన వచ్చింది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో రెజ్లింగ్‌లో శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని ఇద్దరినీ చేర్పించాడు. రోజూ సాయంత్రం శిక్షణకు పంపుతూ ప్రోత్సహించాడు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్న శ్రావణి ఒకవైపు చదువు, మరోవైపు శిక్షణ రెండింటినీ సమన్వయం చేస్తూ సత్తా చాటుతోంది. జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో 3 సార్లు పాల్గొంది. రాష్ట్ర, జిల్లాస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధిస్తోంది. జాతీయస్థాయిలో ఆడేందుకు మార్గం సుగమం చేసుకుంది. ఆమె చెల్లెలు ‘లోచిత’ రెజ్లింగ్‌లో శిక్షణ పొందుతోంది.

తండ్రీతనయల భావోద్వేగాల యాత్ర

సుచిత్ర కూడలికి చెందిన శ్రీకాంత్‌ యూఎస్‌లో నేవీ అధికారి. ముంబయికి చెందిన సోనియాను ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మానాన్న, ఓ తమ్ముడు, చెల్లి చక్కని అందమైన కుటుంబం. ఆయన కుటుంబం నగరంలో స్థిరపడింది. తన పాప ఇషాన్వికి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఈ తండ్రీ, తనయల సంకల్ప యాత్రకు ఆఫ్రికాలో ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని ఎంచుకున్నారు. 5,895 మీటర్లున్న ఈ యాత్రను ఓ సాహసయాత్ర అనడం కంటే తండ్రి కూతుళ్లు భావోద్వేగాల విజయయాత్ర అనొచ్చు. అనుకున్నదే తడవుగా కిలిమంజారో అధిరోహణకు కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి బయలుదేరారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని పర్వతం అగ్రభాగానికి చేరారు. తానూ ఈ ఘనత సాధించానని మరచి పుత్రికోత్సాహంతో మురిసిపోయాడు.

రెండేళ్లు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో..

చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ కొద్దోగొప్పో ఆస్తులు కూడబెట్టుకుంటూ ఇద్దరు కుమారుల్ని ప్రయోజకుల్ని చేశాను. ఒకరు అమెరికాలో స్థిరపడగా మరొకరు ఇక్కడే ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమ వివాహం చేయాలంటూ చిన్న కుమారుడు కోరితే తిరస్కరించాను. పట్టించుకోవడం మానేశారు. రెండేళ్లపాటు సికింద్రాబాద్‌లోని ఓ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కి తీసుకెళ్లి వదిలేశారు. అనారోగ్యం బారిన పడినా పట్టించుకోలేదు. బావకు ఫోన్‌ చేస్తే గాంధీ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. కోలుకొని ఇంటికెళ్లినా మాట్లాడేవారు కరవు. ఆస్తి మొత్తాన్ని వారి పేరున రాయాలంటూ ఒత్తిడి చేశారు. భార్య సైతం కుమారుల మాటకు వంత పాడింది. సఖి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో చిన్న గది ఇచ్చి ఉండమన్నారు. తిన్నావా.. అని అడిగేవారు లేరు. ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే, నెలకు రూ.7 వేల వరకు ఇస్తున్నారు. నాతోపాటు అక్క, బావపై తప్పుడు కేసులు పెట్టారు.

- నర్సింహారావు, చైతన్యపురి

తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని

ఇద్దరు కుమారులు పుట్టాక అనారోగ్యంతో భార్య చనిపోతే మేనమామ కూతురుని రెండో వివాహం చేసుకున్నాను. తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారు. మొదటి ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ టీచరు, రెండో అబ్బాయి కెనడాలో స్థిరపడ్డాడు. మూడో, నాలుగో అబ్బాయిలు హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. పెద్దల నుంచి వచ్చిన ఆస్తి మూడున్నర ఎకరాలు ఉంటే నా కష్టార్జితంతో మరో ఆరెకరాలు కొనుగోలు చేశాను. అందరికీ మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశాను. పెద్ద అబ్బాయి పేరు మీద మూడున్నర ఎకరాలు రాశాను. నాకు తెలియకుండానే రూ.80లక్షల విలువైన ఆస్తిని అమ్మేశాడు. మిగిలిన ఆరెకరాల ఆస్తి విషయంలో పక్కవాళ్లతో వివాదాలు వస్తే లాయర్‌ దగ్గరికి ఏం వస్తావంటూ రూ.200 బాండ్‌పేపర్‌ మీద, తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నాడు. తీరా నైజం బయటపడటంతో పెద్దల సమక్షంలో కాగితాలు ఇస్తానంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంటికొచ్చి కొడుతున్నాడు. కోర్టును ఆశ్రయిస్తే, నలుగురు కుమారులు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వాలని తీర్పు వెలువరించింది. అవీ ఇవ్వడం లేదు. కలెక్టరు, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశాను.

- లింగారెడ్డి, కొత్తపేట

వారికి డబ్బే ముఖ్యమైంది

ప్రభుత్వ ఉద్యోగం.. ముత్యంలాంటి కుమారుడు.. అడిగిందల్లా కాదనకుండా అన్నీ చేతికందించాను. చదువు సంధ్యలు చెప్పించి ప్రయోజకుడిని చేశాను. పెళ్లి తంతు ముగించి బాధ్యత తీర్చుకున్నాను. 2009లో ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి మా మధ్య బంధం బలహీనపడటం మొదలైంది. రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన ఆస్తులను అమ్మేసి, బ్యాంకులో కొంత రుణం తీసుకుని ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. తన పేరుతో రుణం తీసుకోవడంతో ఇల్లు సైతం కుమారుడి పేరుపైనే రిజిస్టర్‌ అయింది. అంతకుముందే కొన్న మరో ఇంట్లో ఉంటున్న కొడుకు మమ్మల్ని పట్టించుకోకపోవడంతో నా కష్టార్జితంతో కొన్న అపార్ట్‌మెంట్‌కు వచ్చేశాను. ఇంతలో అపార్ట్‌మెంట్‌ను అమ్మేస్తానంటే నేను అంగీకరించలేదు. మరో ఇల్లు కట్టిస్తానన్నాడు. ఆ మాటల్లో భరోసాకన్నా అవసరమే కనిపించింది. అప్పటి నుంచి గొడవలు, మానసిక క్షోభ మొదలైంది. భుజాలపై ఎత్తుకొని పెంచిన కుమారుడు చివరి క్షణాల్లో ఇలా క్షోభ పెట్టడం మరింతగా కుంగదీస్తోంది. మానవ సంబంధాల్లో డబ్బే కీలకమవుతోంది. వృద్ధాశ్రమాలు పెరిగిపోవడానికి ఇదీ కారణమే.

- శ్రీనివాస్‌, మాదాపూర్‌

Last Updated : Jun 20, 2021, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details