నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. అక్కడక్కడా తొలకరి వానలు పడుతున్నాయి. ఇవాళ ఏరువాక పున్నమి సందర్భంగా దుక్కులు దున్నేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. యాసంగిలో ధాన్యం అమ్మిన రైతులకు ఇంకా దాదాపు రూ.రెండు వేల కోట్ల వరకూ చెల్లింపులు జరగలేదు, రైతుబంధు సొమ్మునూ ప్రభుత్వం విడుదలచేయకపోవడంతో పంటల సాగుకు పెట్టుబడులు ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియడంలేదంటూ సన్న, చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2022-23) మొదలై ఇప్పటికే రెండున్నర నెలలు పూర్తయ్యాయి. అయినా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ‘వార్షిక పంటరుణ ప్రణాళిక’ విడుదల చేయలేదు. ఈ వానాకాలం సీజన్‌లో పంటరుణాలకు ఎంత సొమ్ము పంపిణీ చేయాలో తెలిపే రుణ ప్రణాళికే కిందిస్థాయి బ్యాంకులకు సమితి ఇంకా పంపలేదు. దీంతో బ్యాంకులు రుణాల మంజూరుకు ససేమిరా అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
విత్తనాలు, కౌలు, ఎరువులు..అన్నీ ప్రియం:డీజిల్ ధరల పెరుగుదలతో దుక్కులు, ఇతర రవాణా ఖర్చులు గతేడాదికన్నా 20-30 శాతం పెరిగాయి. వీటికితోడు విత్తనాల ధరలను ప్రైవేటు కంపెనీలు అమాంతం పెంచేశాయి. ఉదాహరణకు గతేడాది(2021) వానాకాలంలో సోయా చిక్కుడు విత్తనాలను క్వింటాను రూ.9 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో రూ.14 వేలు ఇవ్వాలని కంపెనీలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ టెండర్లలో ధరలను కోట్ చేయడంతో సంస్థ వాటిని రద్దు చేసింది. దీంతో విత్తన కంపెనీల నుంచి విత్తనాలు తెచ్చిన వ్యాపారులు చెప్పే ధరకే కొనక తప్పని పరిస్థితి. వరి విత్తనాలను పలు కంపెనీలు క్వింటాకు రూ.4 వేల నుంచి రూ.4500 దాకా(గతేడు కన్నా రూ.500 అధికం) విక్రయిస్తున్నాయి. రాష్ట్రంలో అధికంగా సాగయ్యే పత్తి విత్తన ప్యాకెట్ ధరను కేంద్రం రూ.765 నుంచి రూ.810కి పెంచింది. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు వంటి సంకరజాతి విత్తనాలదీ అదే దారి. ‘‘పలు ప్రాంతాల్లో భూముల కౌలు పెరిగింది. పత్తి, మిరప వేయాలంటే రూ.20 వేల నుంచి 32 వేల దాకా చెల్లించాల్సి వస్తోంది. కౌలు సొమ్ము ముందే ఇవ్వాలని యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. అవి కట్టడానికి ప్రైవేటు అప్పులు తీసుకుంటున్నామని’ పలువురు రైతులు చెప్పారు.
రసీదు ఇవ్వకుండా వ్యాపారుల మెలిక:విత్తనాలు కొనేందుకు డబ్బుల్లేని రైతులు వ్యాపారుల దుకాణాల్లో అప్పు రాయించి తీసుకుంటున్నారు. అలాంటి వారికి వ్యాపారి నగదు రసీదు ఇవ్వడం లేదు. ‘‘విత్తనాలు నాసిరకం అని తేలి, పంట పండకపోయినా రసీదు లేకపోతే రైతు వ్యాపారిపై ఫిర్యాదు చేయలేడు. విత్తన కంపెనీ నుంచి పరిహారమూ అడగలేడు. రసీదు ఇవ్వకపోవడానికి అదే కారణమని’ ఓ రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారి ఒకరు చెప్పారు. పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని తెలిపారు.