తెలంగాణ

telangana

ETV Bharat / city

NEET Exam 2021 : రెండ్రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు నిపుణుల సూచనలు

దేశవ్యాప్తంగా ఈనెల 12 నీట్ పరీక్ష(Neet Exam 2021) జరగనుంది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటం వల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నెగెటివ్ మార్కుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

నీట్ పరీక్ష 2021
నీట్ పరీక్ష 2021

By

Published : Sep 10, 2021, 7:44 AM IST

నీట్‌ పరీక్ష(Neet Exam 2021) సమీపించింది. విద్యార్థులకు ఇక రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ఎంత చదివినా పరీక్షకు ముందు ప్రణాళిక, పరీక్ష రాసే వ్యూహం ఎంతో కీలకమన్నది నిపుణుల మాట. దేశవ్యాప్తంగా ఈ నెల 12న నీట్‌ జరగనుంది. పరీక్ష సన్నద్ధతపై ఆయా సబ్జెక్టు నిపుణులను సంప్రదించగా, వారు పలు ముఖ్య సూచనలు చేశారు. దాదాపు 16 లక్షల మంది పోటీపడుతుండటంతో ప్రతి మార్కు ఎంతో కీలకం. ఈసారి ఇద్దరికి ఒకే మార్కులు వస్తే, నెగెటివ్‌ మార్కులు తక్కువగా వచ్చిన వారికి ముందు ర్యాంకు ఇస్తారు. అందువల్ల నెగెటివ్‌ మార్కుల విషయంలో జాగ్రత్త.

ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నలు అదనం

నీట్‌(Neet Exam 2021)లో ఈసారి స్వల్ప మార్పులు చేశారు. గతంలో మొత్తం 180 ప్రశ్నలిచ్చేవారు. అన్నిటికీ సమాధానాలు రాయాల్సి ఉండేది. ఈసారి ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నల చొప్పున కలిపారు. ఒక్కో సబ్జెక్టులో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలిస్తారు. వాటిలో జవాబులు రాయాల్సింది 180 ప్రశ్నలకే. సమయం మూడు గంటలే ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు ‘ఎ’ సెక్షన్‌లో 35 ప్రశ్నలుంటాయి. అన్నీ రాయాలి. ‘బి’ సెక్షన్‌లోని 15 ప్రశ్నల్లో 10 రాయాలి.

తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు

"నీట్‌(Neet Exam 2021)లో ర్యాంకును నిర్ణయించేది భౌతికశాస్త్రమే. ఎక్కువ మంది కష్టంగా భావించేదీ ఇదే. లాటరీ విధానంతో జవాబులు గుర్తిస్తే నష్టమే ఎక్కువ. తెలిసిన ప్రశ్నలకే రాయాలి. అనుమానం ఉంటే వదిలేయాలి. ద్వితీయ ఇంటర్‌ సిలబస్‌ కొంత సులభంగా ఉంటుంది. అందులో ఎక్కువ స్కోర్‌కు అవకాశం ఉంది. ఆధునిక భౌతికశాస్త్రం (మోడర్న్‌ ఫిజిక్స్‌), ఆప్టిక్స్‌లో ఎక్కువ స్కోర్‌ చేయవచ్చు. కష్టమైన రొటేషనల్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌ లాంటి అంశాల జోలికి ఇప్పుడు వెళ్లకపోవడం మంచిది."

- ఎస్‌వీఎస్‌ అనంత రామశర్మ, భౌతికశాస్త్ర నిపుణుడు

జ్ఞాపకశక్తి పరీక్షించే ప్రశ్నలు చూసుకోండి

"వృక్ష, జంతుశాస్త్రాల్లో జ్ఞాపకశక్తి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలు 60 శాతానికి పైగా ఉంటాయి. అందుకే వాటిని ఈ రెండు రోజుల్లో ఒకసారి చూసుకోవాలి. ముఖ్యమైన అధ్యాయాలను రివిజన్‌ చేసుకోవాలి. చిత్రాల ఆధారంగా ఇచ్చే అంశాలు...ఉదాహరణకు కణ విభజన (సెల్‌ డివిజన్‌), వాటి దశలు, ఫ్లో ఛార్టులు, మొక్కల్లో చీడలు, క్రిమికీటకాల వంటివి గుర్తుపెట్టుకోవాలి."

- జి.బసవరాజు, వృక్షశాస్త్ర నిపుణుడు

గత పొరపాట్లు గుర్తుచేసుకోండి

"వారాంతపు, యూనిట్‌, గ్రాండ్‌ టెస్టుల్లో మీరు చేసిన పొరపాట్లను చూసుకుంటే మళ్లీ చేయకుండా ఉండొచ్చు. ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఆర్డర్స్‌ సంబంధిత అంశాలు, ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఫార్ములేషన్లు, యూనిట్లు, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నేమ్డ్‌ రియాక్షన్లు, రీఏజెంట్లను రివిజన్‌ చేసుకోవాలి. సంబంధిత గ్రాఫ్స్‌ (పట్టిక) పరిశీలించాలి. తప్పు, ఒప్పు తరహా ప్రశ్నల్లో గందరగోళం పడకుండా, వాటిని బాగా అర్థ చేసుకోవాలి."

- వేమూరి శ్రీనివాస్‌కుమార్‌, రసాయనశాస్త్ర నిపుణుడు

మరింత చురుగ్గా ఆలోచించాలి

"ఈసారి 20 ప్రశ్నల మేరకు వెసులుబాటు కల్పించారు. కానీ ఇందులో సరిగ్గా అంచనా వేయకపోతే విద్యార్థులు నష్టపోతారు. ఎందుకంటే 3 గంటల్లోనే 200 ప్రశ్నలూ చదవాలి. అదనపు ప్రశ్నలు చదివితే తప్ప.. వేటిని ఎంచుకోవాలనే స్పష్టత రాదు. ఇది విద్యార్థులకు సవాలే. మరింత చురుగ్గా ఆలోచించాలి. ముందు నుంచే సాధన అవసరం. మోడల్‌ ఓఎంఆర్‌ షీట్‌ను ఎన్‌టీఏ ఆన్‌లైన్‌లో ఉంచింది. విద్యార్థులు దాన్ని సాధన చేస్తే మంచిది."

- డి.శంకర్‌రావు, డీన్‌, శ్రీచైతన్యవిద్యా సంస్థలు, కూకట్‌పల్లి బ్రాంచ్‌

మొదటిసారే జాగ్రత్తగా ప్రశ్నల్ని చదవండి

"ఇటీవల స్టేట్‌మెంట్‌ తరహా ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిని ఒకసారి పైపైన చదివి తర్వాత స్పష్టంగా చదువుదామని విద్యార్థులు అనుకుంటారు. సమయం కీలకమైనందున మొదటిసారే అర్థం చేసుకునేలా చదవాలి. తప్పు, ఒప్పు ప్రశ్నల్లో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. కింద ఉన్న నాలుగు ఐచ్ఛికాలను పూర్తిగా చదివాకే జవాబును గుర్తించాలి. మనిషి ఆరోగ్యం, జబ్బులకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలొస్తాయి. వాటిని ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే చదవాలి. పరీక్షకు రెండు రోజుల ముందు పాత, మాదిరి ప్రశ్నపత్రాల సాధన అనవసరం. పర్యావరణ శాస్త్రంలో ఉదాహరణలు, సంవత్సరాలను చదువుకోవాలి."

- ఎక్కిరాల దత్తాత్రేయ, జువాలజీ నిపుణుడు

ABOUT THE AUTHOR

...view details