METERS IN AP: ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చటం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కి తగ్గినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోంది. కేవలం ప్రయోగాత్మకంగా బిగిస్తున్నామని విద్యుత్‌శాఖ సిబ్బంది కొన్నిచోట్ల సర్దిచెబుతుండగా.. మరికొన్నిచోట్ల చెప్పకుండానే బిగించేస్తున్నారు. రైతులు, ప్రతిపక్ష పార్టీల నేతలు మీటర్లు తీసుకెళ్లే వాహనాలను అడ్డుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గటంలేదు. అనంతపురం, అనంతపురం గ్రామీణం, హిందూపురం డివిజన్లలో ఇప్పటికే 9 వందల మీటర్లు బిగించారు.
రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో వందకు పైగా మీటర్లు బిగించారు. తాము లేని సమయంలో పొలాల్లోకి వెళ్లి.. విద్యుత్ సిబ్బంది, గుత్తేదారులు మీటర్లు బిగిస్తున్నారని రైతులు అంటున్నారు. విద్యుత్ నియంత్రిక కింద మీటర్ల బిగింపు పూర్తవగానే.. కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిలదీసిన వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారని రైతులు అంటున్నారు. నష్టాల సాగుతో ఇప్పటికే అప్పులపాలయ్యామని.. ఇప్పుడు కొత్తగా విద్యుత్ ఛార్జీల భారం వేస్తే ఆత్మహత్యలు చేసుకోవడమే దిక్కని రైతులు వాపోతున్నారు.