ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల కొండపై ఇద్దరు చిన్నారులకు ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన అనిల్‌కుమార్ అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు కుషాల్ (5), రామకృష్ణ (3)తో ద్వారకా తిరుమల వెంకన్న దర్శనార్థం వచ్చారు. కరోనా నేపథ్యంలో 10 సంవత్సరాలలోపు పిల్లలను ఆలయంలోకి అనుమతించడం లేదు. తలనీలాల మొక్కు అనంతరం ఇద్దరు పిల్లలను కారులోనే కూర్చోబెట్టి స్వామివారి దర్శనానికి వెళ్లారు.
ఇద్దరు చిన్నారులను కాపాడిన హోంగార్డు
ఏ ఉద్యోగి అయినా విధుల్లో అప్రమత్తంగా ఉంటే.. ప్రజలకు సేవ చేయడమే కాదు.. ప్రాణాలనూ కాపాడొచ్చు అని నిరూపించాడు ఓ హోంగార్డు. తన సమయస్పూర్తితో ఇద్దరు చిన్నారులను కాపాడాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయ పార్కింగ్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు చిన్నారులను కారులో వదిలి.. వారి తల్లిదండ్రులు స్వామివారి దర్శనానికి వెళ్లారు. కారులో ఆ పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై స్పృహ కోల్పోయారు. గమనించిన హోంగార్డు.. కారు అద్దాలు పగలగొట్టి వారిని బయటకు తీసి కాపాడాడు.
పిల్లలు కూర్చున్న కారు డోర్లు లాక్ అయ్యాయి. పిల్లలు అందులో ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. అది గమనించిన దేవస్థానంలో పనిచేసే హోంగార్డు నరసింహయాదవ్ కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను.. దేవస్థానం ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. దేవస్థానం మైక్‌లో కారు నెంబర్ ఆధారంగా అనౌన్స్మెంట్ చేశారు. అది విని వారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పిల్లలని అక్కున చేర్చుకున్నారు. ఈ ఘటనలో చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. పిల్లల తల్లిదండ్రులు, భక్తులు హోంగార్డుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండీ :కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీ సమావేశం