DIGITAL SURVEY: జూన్ 11 నుంచి పైలట్ విధానంలో డిజిటల్ భూసర్వే
16:27 June 02
DIGITAL SURVEY: జూన్ 11 నుంచి పైలట్ విధానంలో డిజిటల్ భూసర్వే
రాష్ట్రంలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిజిటల్ సర్వే ఏజెన్సీలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సర్వే విధివిధానాలపై ఏజెన్సీలతో చర్చించారు. ఇంచు కూడా తేడా రాకుండా సాంకేతికత వాడాలని సీఎం ఆదేశించారు. జూన్ 11 నుంచి పైలట్ విధానంలో డిజిటల్ సర్వే నిర్వహించనున్నారు. తొలుత 27 గ్రామాల్లో పైలట్ విధానంలో ఈ సర్వే చేపట్టనున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో ఈ పైలట్ సర్వే నిర్వహిస్తారు. 24 జిల్లాల నుంచి మరో 24 గ్రామాలను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. భూతగాదాలు లేని తెలంగాణే లక్ష్యంగా డిజిటల్ సర్వే సాగాలని సీఎం ఆకాంక్షించారు. పట్టాదారుల భూములకు శాశ్వత రక్షణే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల భూమి హక్కులు కాపాడేందుకే డిజిటల్ సర్వే అని స్పష్టం చేశారు.
సర్వే ఏజెన్సీలు ఈ సర్వేను సామాజిక సేవగా భావించాలని కేసీఆర్ సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేయాలని... ఆ తర్వాత పట్టా భూముల సర్వే నిర్వహించాలన్నారు. సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గ్రామస్థులకు పూర్తి అవగాహన కల్పించి సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే ఏజెన్సీలకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు సహకరిస్తారని ఏజెన్సీలకు తెలిపారు.