రాష్ట్రంలో టీకా డోసుల నిల్వలు తగ్గిపోతున్నాయి. రాష్ట్రానికి సుమారు 24 లక్షలకు పైగా కొవిన్ టీకా డోసులు సరఫరా చేయగా.. ఇప్పటికే 16.80 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరో 8 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 70-75 వేల మందికి తొలి, మలిడోసులు కలుపుకొని టీకాలను అందిస్తున్నారు. ఇదే ఒరవడిలో టీకాలను పంపిణీ చేస్తే కేవలం 7-8 రోజులకు మాత్రమే సరిపోతాయి. మున్ముందు రోజుకు లక్ష-లక్షన్నర మందికి కూడా టీకాలివ్వాలని వైద్యశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో.. మూణ్నాలుగు రోజుల్లో రాష్ట్రానికి డోసులను కేంద్రం పంపించకపోతే.. పంపిణీ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదముందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయుల్లో, ప్రైవేటులో 20 పడకల ఆసుపత్రుల్లోనూ టీకాలను ప్రస్తుతం పంపిణీ చేస్తుండగా.. పని ప్రదేశాలు, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల వద్ద కూడా టీకాలను ఇవ్వాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో.. రానున్న రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మరింత వేగంగా జరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి సమయానుకూలంగా టీకాలను సరఫరా చేయకపోతే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి టీకాలను పంపించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పదేపదే సంప్రదించినా.. సానుకూల స్పందన రావడం లేదని, కేంద్ర అధికారులు త్వరితగతిన స్పందించకపోతే టీకాల పంపిణీకి ఆటంకం ఏర్పడే అవకాశాలుంటాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ముఖ్యంగా రెండోడోసు పొందాల్సిన వారికి మరింత జాప్యం కలుగుతుందన్నారు. దీంతో ప్రజల్లో అనవసర ఆందోళనలకు ఆస్కారమిచ్చినట్లు అవుతుందన్నారు.